ములసాలలో పిడుగుపాటు
- 25 గొర్రెలు మృతి
- తీవ్ర దిగ్భ్రాంతిలో గొర్రెల కాపరులు.. పరిహారం కోసం విజ్ఞప్తి
పెద్దపల్లి, సెప్టెంబర్ 22(విజయ క్రాంతి):పెద్దపల్లి మండలంలోని ములసాల గ్రామ(Mulasala village) శివారులో మంగళవారం పిడుగుపాటుకు గురై 25 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అకస్మాత్తుగా సంభవించిన ఈ ప్రకృతి విపత్తుతో బాధిత గొర్రెల కాపరుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామస్తులు కథనం ప్రకారం ములసాల గ్రామానికి చెందిన బోయిని సదయ్య, కాసు నరేష్‌లు తమ గొర్రెల మందను గ్రామ శివారులోకి మేత కోసం తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ప్రమాదవశాత్తు గొర్రెల మందపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడింది. ఈ ఘటనలో సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.
ఆర్థికంగా కుదేలైన కాపరులు జీవనాధారమైన గొర్రెలు కళ్లముందే విగతజీవులుగా మారడంతో యజమానులు బోరున విలపించారు. రోజువారీ మేతపైనే ఆధారపడి జీవనం సాగించే తమకు లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికందివచ్చిన జీవాలు చనిపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని బాధితులు వాపోయారు.
సంబంధిత పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ అధికారులు తక్షణమే ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించాలని గ్రామస్తులు కోరారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి, మృతి చెందిన ఒక్కో జీవానికి తగిన నష్టపరిహారం చెల్లించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కాపరులు వేడుకుంటున్నారు.