రామన్నపేటలో ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు
- ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి
- ఉన్నతాధికారులకు గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్
కోనరావుపేట, అక్టోబర్ 11 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) కోనరావుపేట మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ భూమిని(Government land) ఆక్రమించి అక్రమ నిర్మాణాలు(Illegal constructions) చేపడుతున్నారనే ఆరోపణలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆకెనపల్లి దేవరాజుపై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుడు బిగుళ్ళ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
రామన్నపేట గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు ఆకెనపల్లి దేవరాజు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి అదనపు నిర్మాణాలు చేపడుతున్నారని బిగుళ్ళ బాబు ఆరోపించారు.విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణలు రావడం విచారకరమని పేర్కొన్నారు.అక్రమ నిర్మాణాలను తొలగించాలని గ్రామ పంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు అందజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఉపాధ్యాయుడు నోటీసులు(Teacher Notices) స్వీకరించకపోవడంతో చివరకు ఇంటి గోడకు నోటీసు అతికించి వెళ్లారని బాబు తెలిపారు.
పంచాయతీ అధికారులు జారీ చేసిన నోటీసుల్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు సంబంధించిన అంశాలను పేర్కొన్నారని వెల్లడించారు.ఈ వ్యవహారంపై గత సెప్టెంబర్ 25న జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో), జిల్లా కలెక్టర్‌కు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బిగుళ్ళ బాబు తెలిపారు. ఫిర్యాదు చేసి ఇన్ని రోజులైనా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.భవిష్యత్తు తరాల అవసరాలకు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని, ఆక్రమణలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై విచారణ జరిపి, తప్పు నిర్ధారణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరారు.