బైక్ తో సహా బావిలో పడ్డ రైతు

11-10-2026 | 05:40pm

కాపాడిన యువకులు

లింగంపేట్, అక్టోబర్11, (విజయక్రాంతి): పోలీసులు వాహనాల తనిఖీలు(Police vehicle checks) చేపడుతున్న క్రమంలో పోలీస్ సిబ్బందిని చూసి భయపడి ఓ రైతు బైక్(Farmer's bike) తో పక్కదారి నుంచి వెళ్లే క్రమంలో  బావిలో పడిపోగా, యువకులు కాపాడిన సంఘటన ఆదివారం మధ్యాహ్నం కామారెడ్డి జిల్లా(Kamareddy District) లింగంపేటలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా  లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామానికి చెందిన ఎర్రం దేవయ్య అనే రైతు ద్విచక్ర వాహనంపై పోతాయిపల్లి నుంచి లింగంపేటకు వస్తున్నాడు. లింగంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.

పోలీసులను చూసిన సదరు రైతు తనకు ఎక్కడ ఫైన్ వేస్తారో అనే భయంతో రహదారి పక్కనే ఉన్న మత్తడి కాలువ మీదుగా లింగంపేటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో దేవయ్య వాహనంతో సహా పడిపోయాడు. విషయం తెలుసుకున్న లింగంపేటకు చెందిన, మంద అరుణ్ కుమార్, గౌతమ్ అనే యువకులు ఘటనాస్థలానికి చేరుకొని దేవయ్యను ఒడ్డుకు చేర్చారు. తాళ్ల సహాయంతో ద్విచక్ర వాహనాన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదం నుంచి ఎర్రం దేవయ్య సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు