కాచుకో కేటీఆర్..కౌంట్‌డౌన్ ఖాయం
రాజన్న సిరిసిల్ల29సెప్టెంబర్ (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas), విజయరమణారావు, వేముల వీరేశం, మేడిపల్లి సత్యం తదితరులు మంగళవారం పరిశీలించారు. సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకలు, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు రానున్న నేపథ్యంలో తొలుత భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్‌లో భయం మొదలైంది
ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభ అనగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)లో భయం మొదలైందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ‘‘కాచుకో కేటీఆర్.. నీ కౌంట్‌డౌన్ ఖాయం’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములకు సంబంధించి జరిగిన వ్యవహారాలను సభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామని అన్నారు.తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు భయపడి కాగితాలు విడుదల చేశారంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. పదేళ్లలో కేటీఆర్ ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏం చేస్తున్నామో సీఎం సభ ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధార్మిక, కార్మిక, విద్యా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. నేతన్నలు, కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సిరిసిల్ల అభివృద్ధిపై గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మధ్య తేడాను ప్రజలకు వివరిస్తామని అన్నారు.
రాజన్నను మోసం చేసింది మీరే
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.250 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. వేములవాడ రాజన్నను మోసం చేసినందుకు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సభ ద్వారా సిరిసిల్ల అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రజల ముందుంచుతామని, భారీ సభను విజయవంతం చేయాలని కోరారు.