యూటర్న్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు సూచనలు

29-09-2026 | 01:52pm

జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు పట్టణంలో భారీ స్వాగత తోరణం, యూటర్న్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు సూచనలు

పటాన్ చెరు: మదీనగూడ నుంచి రుద్రారం మీదుగా సంగారెడ్డి వరకు కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులను  పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ఉదయం పరిశీలించారు. జాతీయ రహదారుల సంస్థ అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చెరు పట్టణం ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యత, అభివృద్ధి ప్రతిష్టను ప్రతిబింబించేలా అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ స్వాగత తోరణాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు. పట్టణంలోకి ప్రవేశించే వారికి ఆకర్షణీయంగా ఉండేలా స్వాగత తోరణం నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు.

అదేవిధంగా స్వాగత తోరణం సమీపంలో యూటర్న్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో స్థానిక ప్రజలు, వాహనదారులకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపారు. బస్టాండ్ ఎదురుగా ప్రయాణికుల రాకపోకలకు, స్థానిక వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.

- పనుల్లో జాప్యంపై అసంతృప్తి

జాతీయ రహదారి విస్తరణ పనులు ఆశించిన వేగంతో కొనసాగకపోవడంపై ఎమ్మెల్యే జిఎంఆర్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేశారు.

రహదారి విస్తరణతో పటాన్ చెరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు, వ్యాపారులకు కనీస ఇబ్బందులు కలగకుండా అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల సంస్థ ఈఈ శ్రీనివాస్, డిఈ సందీప్, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు నర్రా బిక్షపతి, వెంకటేష్, కుమార్ గౌడ్, శివారెడ్డి, అశోక్, శంకర్, రాజు, రాజన్ సింగ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు