10 నెలల పసికందుకు అరుదైన ఆపరేషన్
డాక్టర్ విక్రమ్ కుమార్
మహబూబ్ నగర్: అరుదైన ఎముక మజ్జ వైఫల్యంతో బాధపడుతున్న 10 నెలల పసికందుకు సోమాజిగూడ యశోద ఆస్పత్రి(Somajiguda Yashoda Hospital) వైద్యులు విజయవంతంగా స్టెమ్ సెల్ మార్పిడి(Stem Cell Transplant) చికిత్స నిర్వహించారు. ఏపీలోని కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ముళ్ల ఖాజా, రేష్మ దంపతుల కుమారుడు ఎం. ఖాదర్ అర్మాన్కు ఈ చికిత్స అందించారు.
చిన్నారికి ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గడంతో గతేడాది డిసెంబర్ 26న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చిన్నారికి ‘అమెగాకార్యోసైటిక్ థ్రోంబోసైటోపెనియా’(Amegakaryocytic Thrombocytopenia) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ పరిస్థితికి చికిత్సలో భాగంగా తండ్రి నుంచి సేకరించిన మూలకణాలను ఉపయోగించి హాప్లోయిడెంటికల్ స్టెమ్ సెల్ మార్పిడి నిర్వహించినట్లు బోన్ మ్యారో మార్పిడి(Bone Marrow Failure) నిపుణుడు డాక్టర్ విక్రమ్ కుమార్ తెలిపారు. జనవరి 8న చేపట్టిన ఈ చికిత్స విజయవంతంగా పూర్తయినట్లు వెల్లడించారు.
చికిత్స అనంతరం చిన్నారి వైద్యపరంగా స్థిరంగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. అరుదైన వైద్య సమస్యతో వచ్చిన చిన్నారికి తగిన చికిత్స అందించి కోలుకునేలా చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.