ప్రకృతిని పరిరక్షించడమే బతుకమ్మ సందేశం
కోనరావుపేటలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.
డా. హిప్నో పద్మా కమలాకర్.
కోనరావుపేట అక్టోబర్ 18 (విజయక్రాంతి): ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, పూలతో ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతిలో అంతర్భాగమని, ప్రకృతిని కాపాడుకోవడమే బతుకమ్మ పండుగ(Bathukamma Festival) ఇచ్చే గొప్ప సందేశమని ప్రముఖ సైకాలజిస్ట్, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు, హిప్నాటిస్ట్ డా. హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఆదివారం బతుకమ్మ సంబరాలను(Bathukamma Festival) సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు హాజరైన డా. హిప్నో పద్మా కమలాకర్(Padma Kamalakar) మాట్లాడుతూ.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరాలైన పూలు, చెట్లు, నీరు, గాలిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రకృతితో మమేకమై జీవించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య సాగింది.