పోలీస్ అమరవీరులకు ఎస్పీ మహేష్ బి. గితే నివాళులు!

21-10-2026 | 12:25pm

చందుర్తి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని అమరవీరుల స్థూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం సాయుధ పోలీసులు శోక శస్త్రం నిర్వహించగా, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీస్ అమరవీరుల పేర్లను అధికారులు చదివి వినిపించారు.

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసుల సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. జిల్లాలో అంతర్గత భద్రత విధుల్లో ఎనిమిది మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. వారి త్యాగాల ఫలితంగా గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు మెరుగుపడ్డాయని తెలిపారు. అమరవీరుల త్యాగాలను నిరంతరం స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వారి స్ఫూర్తితో ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీసు శాఖ నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.

అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం

1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.

అమరవీరుల కుటుంబాలకు భరోసా

కార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు తెలియజేసిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు.

అక్టోబర్ 21 నుంచి 31 వరకు వివిధ కార్యక్రమాలు

పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ, రన్, ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, ఫొటోగ్రఫీ, వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. యువత, విద్యార్థులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు