జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీనా?
- కేసు పెడితే ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు
- సిట్ ద్వారా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- బీఆర్‌ఎస్ నేత డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, అక్టోబర్ 19(విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పాలనలో జర్నలిస్టులపై(Journalists') థర్డ్ డిగ్రీ పోలీసులు(Third-degree polices) ప్రయోగిస్తున్నారని, పోలీసులే గుండాలుగా ప్రవర్తిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నేత డా. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్(RS Praveen Kumar) మండిపడ్డారు. సోమవారం ఆయన బాధిత జర్నలిస్టులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు కేసు పెడితే కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు(Registration of an FIR) చేయలేని దుర్మార్గమన్నారు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ అంశంపై సిట్ ద్వారా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చెయ్యని నేరానికి జర్నలిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసిస్తున్నారన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో భూ తగాదాల్లో పోలీసులు తలదూర్చిన విషయమై ఏక్ ధమ్ న్యూస్ రిపోర్టర్లు కథనాలు ప్రచురించినందుకు అక్రమ కేసులు నమోదు చేసి గంభీరావు పేట ఎస్‌ఐ ఇద్దరు జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. ఏ నేరం చేయకపోయినా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి,ఇంటి తలుపులు పగలకొట్టి ఆ జర్నలిస్టులను పోలీసులుఅరెస్టు చేశారని, బాధిత జర్నలిస్టులు కేసు పెడితే ఏమాత్రం పట్టించుకోలేదని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
సామాన్యులకు ఒక న్యాయం,రాజకీయ నాయకులకు ఇంకో న్యాయమా? ఇదేనా ప్రజా పాలన అంటే? అని ప్రశ్నించారు. డీజీపీ సీవీ ఆనంద్ ఈ విషయం గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? అని అన్నారు. ఎస్‌ఐ ఎవరి ఆదేశాల మేరకు జర్నలిస్టులపై దాడి చేశారో తెలియాలి. నిష్పాక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.అవసరమైతే కేసును సీఐడీకి అప్పగించాలి లేదా సిట్ ఏర్పాటు చేసి, బాధ్యలైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.