చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు

26-09-2026 | 01:06pm

చాకలి ఐలమ్మ ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తి

కోనరావుపేట, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ(Chakali Ailamma) 131వ జయంతి వేడుకలను కోనరావుపేట(Konaraopeta) మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. రజక సంఘం అధ్యక్షుడు జింక కర్ణాకర్(Jinka Karnakar) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.దొరల పెత్తనాన్ని, భూస్వాముల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించి భూమి హక్కు కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని పలువురు పేర్కొన్నారు.

అణచివేతకు తలవంచకుండా అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పేదలు, మహిళల ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.సామాజిక వివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా నిలిచి హక్కుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శప్రాయమని కొనియాడారు. మహిళా శక్తికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మస్కూరి కాశిరం, కోనరావుపేట ఫ్యాక్స్ చైర్మన్  చేపూరి గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మానుక సత్యం,బీజేపీ నాయకులు గొట్టె రామచంద్రం,గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఫ్యాక్స్ డైరెక్టర్లు, గ్రామ ప్రజలు, రజక సంఘం సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు