అనుమతులు గోరంత.. నిర్మాణాలు కొండంత!

06-10-2026 | 11:23pm

నార్సింగి సర్కిల్‌లో నిబంధనల ఉల్లంఘనలు

పట్టించుకోని అధికారులపై స్థానికుల ఆగ్రహం

మణికొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): నార్సింగి పురపాలక సర్కిల్(Narsingi Circle)-45 పరిధిలో నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర తనిఖీలు చేపట్టకపోవడంతోనే ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అల్కాపురి రోడ్ నంబర్-8లో సుమారు 200 గజాల స్థలంలో భూగర్భ అంతస్తుతో భారీ భవనం నిర్మిస్తున్నట్లు, రోడ్ నంబర్-17లో నర్సరీ సమీపంలో భారీ భవనంతో పాటు పెంట్‌హౌస్ నిర్మిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

నిర్మాణ అనుమతులు, సెట్‌బ్యాక్‌లు, భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక నిబంధనలు, నిర్మాణ నాణ్యత తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా తనిఖీలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టినట్లు నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు