చేవెళ్ల అభివృద్ధిలో వివక్ష లేదు కాలే యాదయ్య
చేవెళ్ల, నవంబర్ 24 (విజయక్రాంతి): మున్సిపాలిటీ అభివృద్ధిలో ఎలాంటి వివక్షకు తావులేకుండా అన్ని వార్డులకు నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. కొందరు చెప్పే తప్పుడు మాటలు విని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన రాజకీయ పరపతిని దిగజార్చుకోవద్దని హితవు పలికారు. చేవెళ్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపాలిటీలోని 11వ వార్డుకు రూ.1.25 కోట్లు, 14వ వార్డుకు రూ.2.35 కోట్లు, 17వ వార్డుకు రూ.3.45 కోట్లు కేటాయించామని తెలిపారు. బీఆర్ఎస్ (BRS) కౌన్సిలర్లు గెలుపొందిన 5వ వార్డుకు రూ.40 లక్షలు, 7వ వార్డుకు రూ.53 లక్షలు, 1, 2వ వార్డులకు రూ.68 లక్షలు కేటాయించామన్నారు. అలాగే బీజేపీ (BJP) కౌన్సిలర్లు గెలుపొందిన 3వ వార్డుకు రూ.50 లక్షలు, 10వ వార్డుకు రూ.42.23 లక్షలు, 12వ వార్డుకు రూ.70 లక్షలు కేటాయించినట్లు వివరించారు. త్వరలో విడుదల కానున్న రూ.28.50 కోట్ల ప్రత్యేక నిధుల్లో భాగంగా ఆయా వార్డులకు అదనపు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. దామరగిద్ద, పామెన, దేవుని ఎర్రవల్లి గ్రామాల నుంచి చేవెళ్ల మున్సిపాలిటీకి రహదారులు నిర్మించి అనుసంధానం చేస్తామని తెలిపారు.
తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈసీ, మూసీ నదులపై 10 వంతెనలు (Bridges) నిర్మించి మండలాల మధ్య రాకపోకలకు సౌకర్యం కల్పించామని చెప్పారు. చేవెళ్లలో ఎమ్మార్వో, ఆర్డీవో, కోర్టు భవన సముదాయాలకు రహదారులు నిర్మించడంతో పాటు ఇరిగేషన్ ఎస్ఈ, ఆర్ అండ్ బీ కార్యాలయాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఐదు మండలాల్లో గోదాములు నిర్మించామని, చేవెళ్ల హనుమాన్ ఆలయం నుంచి ఊరెళ్ల మాణిక్యేశ్వరి మాత ఆలయం వరకు రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు నిర్మిస్తున్న రేడియల్ రోడ్డు (Radial Road)తో నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందన్నారు.
పార్లమెంట్ హెడ్క్వార్టర్గా ఉన్న చేవెళ్లను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసి అభివృద్ధికి నిధులు కేటాయించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఊరెళ్ల వార్డుకు దాతల సహకారం అందించడం సంతోషకరమని, ఆ వార్డుకు కేటాయించిన నిధులను సమస్యలు ఉన్న మరో వార్డుకు బదిలీ చేస్తామని విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.