90 సీట్లు పక్కా
- కోటి ఓట్లతో మళ్లీ వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే
- బీఆర్‌ఎస్ ఇక గతమే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నాడు ఎమ్మెల్యేలను బెదిరించి కేసీఆర్ కండువాలు కప్పిండు
జగన్‌తో అంటకాగి కృష్ణా జలాలను ఏపీకి ధారాదత్తం చేసిండు
కాంగ్రెస్ ప్రభుత్వ స్కీమ్‌లతో బీఆర్‌ఎస్ నేతలకూ లబ్ధి
సంక్రాంతి నుంచి 5 నెలలు ‘ప్రజాబలం’ పేరిట జనంబాట
గాంధీభవన్, ఢిల్లీ చుట్టూ తిరిగితే పదవులు రావు
నాయకులందరూ గ్రామాల్లోనే ఉండాలి
కేంద్ర ప్రభుత్వం జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని డిమాండ్
పీఏసీ, పీసీసీ విస్తృతస్థాయి సమావేశాల్లో ప్రసంగం
నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పెరగనివ్వ కుండా అడ్డుకుంటామని విర్రవీగిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని.. బీఆర్‌ఎస్ ఇక గతమేనని, దానికి భవిష్యత్తు లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లతో 90 సీట్లు గెలిచి రెండోసారి ఇందిరమ్మ రాజ్యమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాడు వైఎస్ జగన్‌తో అంటకాగి కృష్ణా నీళ్లను ఏపీకి ధార దత్తం చేశారని కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు, ప్రజలకు చేరువయ్యేందుకు సం క్రాంతి తర్వాత ఐదు నెలల పాటు ‘ప్రజా బలం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులందరూ ప్రతి గ్రామానికి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆదివారం గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమా వేశంలో, ఆ తర్వాత పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
అన్నాచెల్లెళ్లు కొట్టుకుంటున్నరు
నాడు పీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో అనేక మంది పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను బెదిరించి, అక్రమ కేసుల బనాయించి కేసీఆర్ బీఆర్‌ఎస్ కండువాలు కప్పారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ లేదు, మళ్లీ పెరగనివ్వకుండా అడ్డుకుంటానని కేసీఆర్ విర్రవీగాడు. నాడు ఆత్మవిశ్వాసాన్ని కేసీఆర్ దెబ్బతీసినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు విజయమో, వీర మరణమో అన్నట్లుగా సభ్యత్వాలు చేయించారు.
నేను పీసీసీ అధ్యక్షుడిగా డిజిటల్ మెంబర్‌షిప్ చేపట్టి 90 రోజుల్లో 48 లక్షల మెంబర్‌షిప్‌లను చేయించాం.. ఇది దేశంలోనే అత్యధికంగా సభ్యత్వ నమోదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 92 లక్షలకు పైగా ఓట్లు తెచ్చుకుని 64 సీట్లు గెలుచుకున్నాం. వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లతో 90 సీట్లు గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తాం’ అని తెలిపారు. రాజకీయాల్లో అన్నాచెల్లెళ్లు కూడా ఇప్పుడు కొట్టుకుంటున్నారని.. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.
కేసీఆర్ హయాంలోనే ఏపీ నీటి దోపిడీ
ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘2022లో తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడే పల్నాడు వాటర్ గ్రిడ్ పథకానికి అంకురార్పణ జరిగింది. జల్ జీవన్ మిషన్ కింద రూ.1,580 కోట్ల నిధులకు సంబంధించిన జీవో కూడా ఆ సమయంలోనే విడుదలైంది.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు కూడా బీఆర్‌ఎస్ హయాంలోనే మొదలయ్యాయి. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీటి వినియోగానికి నాడు కేసీఆర్ సంతకం చేయడాన్ని ఆధారంగా చేసుకునే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టులు చేపట్టారు’ అని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏపీలో ఒక్క ప్రాజెక్టు మొదలుపెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. సొంత రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు కనీసం నిధులు కూడా మంజూరు చేయని ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు.
ఈసారి లాగు కూడా విప్పిస్తా..
“కాంగ్రెస్‌కు గతమే కానీ భవిష్యత్తు లేదని బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. కృష్ణా, గోదావరి నీళ్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు. ‘సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కు వస్తా.. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా’ అని చెప్పిన. గతంలో గజ్వేల్‌లో దళిత, గిరిజన దండోరా వేసి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపాం.
మరోసారి అధికారంలోకి వస్తామని ఇటీవల సిద్దిపేటలో చెప్పిన. గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్ వాళ్లు వాళ్లంతట వాళ్లే బట్టలు విప్పుకుని అసెంబ్లీ ముందు నిలబడ్డరు. మొన్న అంగీనే విప్పించాం.. ఈసారి లాగు కూడా విప్పిస్తం. హరీశ్‌రావుకు గొలుసు మీద ఉన్న సోయి తెలంగాణ ప్రజల మీద లేదు’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ స్కీమ్‌లతో బీఆర్‌ఎస్ నేతలకూ లబ్ధి
కరువును ఎదుర్కోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి అన్ని వ్యూహాలు సిద్ధం చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ‘3,700 నుంచి 92 లక్షల ఓట్లు తెచ్చిన కార్యకర్తలు మన దగ్గర ఉన్నారు. పార్టీలకు అతీతంగా పథకాలను అమలు చేస్తున్నాం.. కోటి కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేస్తున్నాం. 52 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 3.42 కోట్ల మందికి ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాం. బీఆర్‌ఎస్ నాయకులు కూడా మనం ఇచ్చిన సన్నబియ్యం తింటున్నారు.
బీఆర్‌ఎస్ నాయకుల ఆడపడుచులు మనం ఇచ్చే ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ నాయకుల ఇండ్లల్లోనూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో వెలుగులు వస్తున్నాయి. బీఆర్‌ఎస్ వాళ్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వం ఇస్తున్న పథకాలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుర్తు చేయాలి’ అని ఆయన వివరించారు. ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ పాలనలో అమలు చేసిన అన్ని పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని చేస్తున్నామని పేర్కొన్నారు.
మహానీయుల విగ్రహాలను కేసీఆర్ పెట్టలేదు
అచ్చంపేట దగ్గరలో సేవాలాల్ మందిరాన్ని నిర్మించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ చుట్టూ జ్యోతిబా ఫూలే దంపతులు, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేశామని.. పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టుకోబోతున్నామని చెప్పారు. బలహీన వర్గాల నుంచి వచ్చి స్ఫూర్తిని ఇచ్చిన మహనీయుల విగ్రహాలు పెట్టాలని ఏనాడు కూడా కేసీఆర్ అనుకోలేదని మండిపడ్డారు. కాళేశ్వరంలో చేసిన పాపాలు కడుక్కోవడానికే సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును కేసీఆర్ పెట్టారని వ్యాఖ్యానించారు.
20 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర..
గతంలో అర్హులకు ఓటు హక్కు కల్పించడానికి జరిగిన ‘సర్’ ప్రక్రియను, మొదటిసారిగా ఓట్లను తొలగించడానికి ప్రధాని మోదీ వాడుతున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ‘సర్’ పేరుతో దేశవ్యాప్తంగా కనీసం 20 కోట్ల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతున్నదని, ఇప్పటికే 13 కోట్ల ఓట్లను తీసేశారని దుయ్యబట్టారు. తెలంగాణలోనూ 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారని మండిపడ్డారు. బ్రిటిష్ హయాంలో ‘సైమన్ గో బ్యాక్’ నినాదం తరహాలోనే ఇప్పుడు ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ నినాదంతో పార్టీ బీఎల్వోలు, శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఓట్లను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రాహుల్‌ను పీఎం చేయాల్సిన బాధ్యత మనదే
బీజేపీ 240 సీట్లు దాటే ప్రసక్తే లేదని గతంలో తాను ఒక ఇంటర్వ్యూలో చెప్పానని, అదే జరిగిందని సీఎం రేవంత్ అన్నారు. ‘బీజేపీకి 25 సీట్లు తగ్గి, కాంగ్రెస్‌కు 25 సీట్లు పెరిగి ఉంటే ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది’ అని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ నేతలు భుజాన వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఇందిరా గాంధీ చివరి శ్వాస విడిచినప్పుడు మెదక్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎప్పుడూ అండగా ఉంది.
ఇప్పుడు కూడా రాహుల్ గాంధీకి అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులే తెలంగాణ రైతుకు సాగునీటి భరోసా. రికార్డు వరి ఉత్పత్తికి ఆ ప్రాజెక్టులే ఆధారం. కాళేశ్వరం ఆశించిన ప్రయోజనం అందించలేదు’ అని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీలో పనిచేసిన అనేక మందికి పదవులు ఇచ్చామని తెలిపారు.
జనగణనలో ఓబీసీ గణన చేపట్టాలి
అన్ని చట్టాలు, న్యాయస్థానాల ముందు నిలబడేలా కులగణన చేశామని, కులగణనలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలబడిందని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణను చూసి కులగణన చేయాలని కేంద్రానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ రాశారని తెలిపారు. గిగ్ వర్కర్ల కోసం చట్టం చేసిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని తెలిపారు. 2027 జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని కోరుతూ ప్రధానికి లేఖ రాయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌కు సీఎం తెలిపారు.
ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే 8 నెలల పాటు ప్రజలకు తాగునీరు అందించాల్సి ఉన్నందున ప్రాజెక్టుల నీటిని తాగునీటికే వినియోగిస్తామని ఆయన అన్నారు. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రానికి రూ. 30 వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేం ద్రాన్ని కోరుతూ పీఏసీలో తీర్మానం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు కొరత లేదని, వర్షాకాలంలో 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నా రైతులకు విద్యుత్‌ను అందించి పంటలు ఎండిపోకుండా కాపాడామని తెలిపారు.
అందరి లెక్కలున్నాయి
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ‘అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన వ్యూహం మేం రూపొందిస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రవర్తన, మాట తీరును నిశితంగా గమనిస్తున్నాం. ఏ నాయకుడు.. ముందు ఏం మాట్లాడుతున్నారు.. వెనుక ఏం మాట్లాడుతున్నారో సంపూర్ణంగా పార్టీ దగ్గర సమాచారం ఉంది. రాజకీయాల్లో బ్యాలెన్స్ షీట్ ఐదేండ్లకు ఒకసారి వస్తుంది. ఎవరి శ్రమ ఎంత ఉందో ఎన్నికల సమయంలో కొలుస్తాం. పార్టీ లైన్‌లో ఉంటే ఇంటికి పదవి దానంతట అదే వస్తుంది.
గాంధీభవన్ చుట్టూ తిరిగినంత మాత్రాన, ఢిల్లీలో తిరిగినంత మాత్రాన పదవులు వస్తాయనుకోవడం అపోహ. వెళ్లాల్సింది ఢిల్లీకి కాదు. వెళ్లాల్సింది గ్రామాలు, తండాలు, పేదల దగ్గరకు! పేదలకు ఆత్మబంధువు అయిన వాళ్లే కాంగ్రెస్ నాయకులు అవుతారు’ అని సీఎం రేవంత్ తెలిపారు.
పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎదురుగా వచ్చి డిస్కో డ్యాన్స్ చేస్తుందని, చూసీ చూడనట్లు ఉంటే కొంత మంది నాయకులు ఇష్టారీతిగా ఉంటారని చురకలంటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను నూటికి నూరు శాతం తూ.చా. తప్పకుండా పాటిస్తామని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఏమైనా లోపాలు లేదా చెడు విషయాలు ఉంటే తన చెవిలో చెప్పాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మాత్రం మైక్‌లో గట్టిగా ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు.