బుద్వేల్‌లో అక్రమ లేఅవుట్ల ధ్వంసం

25-10-2026 | 05:30am
  1. జేసీబీలతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది
  2. హద్దురాళ్లు, డ్రైనేజీ పైపుల తొలగింపు 
  3. కఠిన చర్యలు తప్పవని డీసీ హెచ్చరిక

రాజేంద్రనగర్, అక్టోబరు 24 (విజయ క్రాంతి) : జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్(GHMC Rajendranagar Circle) పరిధిలోని బుద్వేల్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ లేఅవ్పు అధికారులు ఎట్టకేలకు ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ సాగుతున్న అక్రమ నిర్మాణాలను శనివారం ఉదయం అధికారులు వేగంగా తొలగించారు. 

బుద్వేల్ పరిధిలోని సదరు భూమినీ ప్లాట్లుగా మారుస్తూ హద్దురాళ్లు నాటడమే కాకుండా, అనధికారికంగా డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నగర ప్రణాళిక, మున్సిపల్ సిబ్బంది ఈరోజు ఉదయాన్నే జెసిబిలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. లేఅవుట్ కోసం వేసిన హద్దురాళ్లను పెకలించి వేయడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన డ్రైనేజీ పైపులను పూర్తిగా ధ్వంసం చేశారు.

ఉపేక్షించేది లేదు : డీసీ సురేందర్ రెడ్డి

ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి అక్రమ లేఅవుట్లు వేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రాజేంద్రనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్  సురేందర్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై నిరంతరం నిఘా ఉంటుందని, ప్రజలు కూడా అనుమతులు లేని ప్లాట్లను కొనుగోలు చేసి మోసపోవద్దని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు