ప్రభుత్వ భూమి మాయం.. పట్టా భూమిగా నమోదు!?
- మంగళపల్లిలో 4.34 ఎకరాల భూమిపై రికార్డుల మతలబు?
- ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 96.. పట్టా భూమిగా 96/1లో నమోదు
- రికార్డుల్లో 4.25 ఎకరాల పట్టా భూమి ఉన్నట్లు మార్పులు
- ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్లు
- భూరికార్డుల మార్పుల వెనుక ఎవరున్నారు?
- రెవెన్యూ అధికారుల పాత్రపై అనుమానాలు.. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్
అబ్దుల్లాపూర్మెట్/ఇబ్రహీంపట్నం, నవంబర్ 27: ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ శాఖలోనే భూ రికార్డుల మార్పుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీం పట్నం మండలం(Ibrahimpatnam Mandal) మంగళపల్లి గ్రామ పరిధిలో విలువైన ప్రభుత్వ భూమి ప్రస్తుతం పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదయింది.
సర్వే నంబర్ 96లో మొత్తానికే 4 ఎకరాల 34 గుంటల ప్రభుత్వ భూమి ఉం డగా .,సర్వే నంబర్ 96/1 గా నమోదు చేసి 4.25 ఎకరాల పట్టా భూమిగా ఎలా నమోదయ్యింది అని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మా రింది. గతంలో రెవెన్యూ అధికారులు ఈ భూమిలో సూచిక బోర్డు ఏర్పాట్లు చేయగా.. రాత్రికి రాత్రి ఆ సూచక బోర్డులు మాయమయ్యాయి. అంతేకాకుండా భూభారతిలో 96 సర్వే నెంబర్కు సంబంధించిన ఇలాంటి వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తుంది.
రూ.50 కోట్ల భూమిపై రికార్డుల మార్పు!
మంగళపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 96లో 4.34 ఎకరాలు గల ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉంది. అయితే ప్రస్తుతం సర్వే నంబర్ 96కు బదులుగా 96/1గా నమోదు చేసి ,అందులో 4.25 ఎకరాల భూమిని పట్టా భూమిగా నమోదు చేశారు. వాస్తవానికి ఈ రెండు సర్వే నంబర్ల పరిధిలో కలిపి ఉన్న భూమి విస్తీర్ణం 4.34 ఎకరాలేనని స్థానికులు చెబుతుండ్రు.దీంతో ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమిగా ఎలా మారింది? సర్వే నంబర్ల విభజనకు,రికార్డుల మార్పునకు ఆధారాలేమిటి? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారుల కనుసన్నల్లోనే జరిగిందా?
ప్రస్తుతం ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల వ రకు ఉంటుందని అంచనా. ఇంతటి వి లువైన భూమికి సంబంధించిన రికార్డుల్లో మార్పులు చోటు చేసుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ యంత్రాంగంలోనే ఇలాంటి మార్పులు జరిగాయా? లేక నిబంధనలకు విరుద్ధంగా రికార్డులు సృష్టించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ జరిగితేనే వాస్తవాలు బట్టబయలవుతాయి.
పాత రికార్డులు పరిశీలిస్తే అసలు గుట్టు రట్టు..
ఈ వ్యవహారంలో గతంలో ఉన్న రెవెన్యూ రికార్డులు, సెటిల్మెంట్ రిజిస్టర్లు, పహాణీలు,సర్వే మ్యాపులు, రిజిస్ట్రేషన్ పత్రాలు,పట్టాదారు పాస్బుక్లు,ధరణి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.ముఖ్యంగా సర్వే నంబర్ 96 నుంచి 96/1గా ఎప్పుడు విభజించారు? ఆ మార్పునకు అనుమతులు ఎవరు ఇచ్చారు? ప్రభుత్వ భూమి పట్టా భూమిగా నమోదు కావడానికి ఏ పత్రాలను ప్రాతిపదికగా తీసుకున్నారు? సంబంధిత ఉత్తర్వులు ఉన్నాయా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలి.
ఉన్నతాధికారులు స్పందించేనా..?
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. పాత,ప్రస్తుత రికార్డులను పోల్చి భూమి హక్కులు, సర్వే హద్దులు, రికార్డుల మార్పులపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమి అక్రమంగా పట్టా భూమిగా మార్చినట్లు తేలితే అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భూమిని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని కోరుతున్నారు.కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమి వ్యవహారంపై జిల్లా యంత్రాంగం ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మంగళపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి పట్టాగా మారిన వ్యవహారంపై సంబంధిత రెవెన్యూ అధికారి వివరణ కోసం ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.