నార్సింగి సర్కిల్‌లో మళ్లీ ‘అక్రమ’ హడావుడి..!

28-10-2026 | 05:10am
  1. కూల్చేసిన షెడ్డునే మళ్లీ కడుతున్నారు..
  2. అధికారుల నిర్లక్ష్యమా? రాజకీయ ఒత్తిళ్లా..?
  3. ఖానాపూర్‌లో వివాదాస్పదంగా మారిన భారీ షెడ్ పునర్నిర్మాణం
  4. అమ్యామ్యాల మత్తులో కిందిస్థాయి సిబ్బంది ఉన్నారని స్థానికుల ఆగ్రహం
  5. కలెక్టర్, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగాలని డిమాండ్

గండిపేట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): అధికారులు కూల్చివేసిన స్థలంలోనే మళ్లీ నిర్మాణాలు జోరందుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం నార్సింగి సర్కిల్(Narsingi Circle) వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజధాని నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై(illegal constructions) అధికారులు ఉక్కుపాదం మోపుతున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కూల్చివేసిన చోటే మళ్లీ నిర్మాణాలు...

ఖానాపూర్ ప్రాంతంలో గతంలో నార్సింగి సర్కిల్ పురపాలక(Narsingi Circle Municipality) అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ ఒక భారీ షెడ్ను కూల్చివేశారు. అయితే, అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసిన అదే స్థలంలో ఇప్పుడు మళ్లీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండటం గమనార్హం.ఒకసారి అక్రమమని తేల్చి కూల్చివేసిన నిర్మాణాన్ని, మళ్లీ ఎలా నిర్మిస్తున్నారనే దానిపై స్థానికులు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నిర్మాణానికి మున్సిపల్ శాఖ(Municipal Department) నుంచి ఏమైనా కొత్త అనుమతులు వచ్చాయా? లేక అధికారుల కళ్లముందే చట్టాన్ని చుట్టూ తిప్పుతూ అక్రమంగా పనులు కానిచ్చేస్తున్నారా? అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారుల పై ‘మామూళ్ల’ మాయాజాలమా..?

కూల్చివేసిన షెడ్ పనులు మళ్లీ ప్రారంభం కావడం వెనుక కిందిస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో పాటు బడా నాయకుల రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం... కిందిస్థాయి అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి, ఇలాంటి నిబంధనల ఉల్లంఘనలను పట్టించుకోకుండా ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి కూల్చివేత డ్రైవ్ చేపట్టి హంగామా చేయడం, ఆ తర్వాత మామూళ్లు అందుకొని సైలెంట్ అయిపోవడం పరిపాటిగా మారిందని ఆరోపిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే తొలగించాలి..

ఈ వ్యవహారంపై నార్సింగి సర్కిల్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి, ఒకవేళ ఈ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని తేలితే వెంటనే పనులను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ షెడ్ను పూర్తిగా నేలమట్టం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దృష్టి సారిస్తేనే చెక్...

కిందిస్థాయి సిబ్బంది తీరుతో నగర శివార్లలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ ఉన్నతా ధికారులు నేరుగా జోక్యం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తేనే ఇలాంటి అక్రమ కట్టడాలకు శాశ్వతంగా చెక్ పడుతుందని, లేకపోతే ‘మామూళ్ల’ పర్వం శరామామూలే అవుతుందని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు