పాతుకుపోయిన నకిలీ ఉద్యోగులు!

09-10-2026 | 05:30am
  1. అధికారుల సంతకాల ఫోర్జరీతో కొన్ని తప్పుడు పనులు
  2. వంశ వృక్షంతో మరికొన్ని నకిలీ ఏజెన్సీ ధ్రువపత్రాలు..!
  3. విచారణ పూర్తు రెండేళ్లు.. అయినా చర్యలు శూన్యం.
  4. గ్రూప్1 నుంచి గ్రూప్4 వరకు నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం
  5. వందల సంఖ్యలో ఉద్యోగులున్నట్లు ఆరోపణలు
  6. అధికారుల తీరు పట్ల ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగుల్లో అసంతృప్తి 

నాగర్ కర్నూల్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్(Nagarkurnool) జిల్లాలోని మైదాన ప్రాంత సామాన్య వ్యక్తులు కొంతమంది నకిలీ ఏజెన్సీ దృవపత్రాలు పొంది ఏజెన్సీ కోటాలో ఉద్యోగాలు పొందరు. మండల డివిజన్ స్థాయి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి బోనఫైడ్, జనన, స్థానిక ధ్రువపత్రాలు పొందడంతోపాటు మరి కొంతమంది ఏజెన్సీ ప్రాంతంలోని తప్పుడు వంశవృక్షాన్ని నమోదు చేయించుకుని నకిలీ ఏజెన్సీ దృవపత్రాలు పొందినట్లు తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి.

ఈ విధంగా సుమారు వందల మంది గ్రామస్థాయి ఉద్యోగుల నుండి డివిజన్ స్థాయి ఉద్యోగుల వరకు నకిలీ ధృవపత్రాలతో ఏజెన్సీ కోటాలో ఉద్యోగాలు సాధించినట్లు తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో అసలైన ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు, గిరిజన సంఘాల నేతలు ఆర్టిఐ అప్లికేషన్ల ద్వారా పూర్తి ఆధారాలు సేకరించి ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం గత రెండేళ్ల క్రితం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

అప్పట్లో విజయక్రాంతి ఈ వ్యవహారంలో మరికొన్ని వాస్తవాలను బయటికి తీసుకురాగా అచ్చంపేట ఆర్డీవో కార్యాలయంలో కొంత మంది ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల వ్యవహారంలో విచారణ చేపట్టారు. నకిలీ ఏజెన్సీ ధృవపత్రాలు ద్వారా ఉద్యోగాలు పొందినట్లుగా నిర్ధారణ అనంతరం అప్పట్లోనే జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక అందించారు. కానీ ఈ వ్యవహారంలో రాజకీయ, ధన బలం ప్రదర్శించిన కొంతమంది నకిలీ ఉద్యోగులు ఆ నివేదికను తొక్కి పట్టినట్లు ఆరోపణలు వినిపించాయి.

ఈ నేపథ్యంలోని అప్పటి ఉన్నత స్థాయి అధికారులు సైతం ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్లు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నకిలీ ధ్రువపత్రాల ఆరోపణలపై విచారణ పూర్తు రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గ్రూప్4 నుంచి గ్రూప్1 స్థాయి వరకు నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందినట్లు విచారణలో వెలుగుచూసాయి.

ఏజెన్సీ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు స్థానికులుగా చూపించుకునేందుకు రెవెన్యూ, విద్య, వైద్యారోగ్య, అటవీ, ఇరిగేషన్, పోలీస్ తదితర శాఖల్లో ఇలాంటి వ్యవహారాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు ఉద్యోగాల్లో చేరిన అనంతరం ప్రమోషన్లు పొందుతూ ఉన్నతస్థాయికి చేరుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఉద్యోగాలు చేస్తున్న అధికారులు సామాన్య మధ్యతరగతి నుంచి ప్రతి పనికి రేటు చొప్పున అనేక అక్రమాలకు కూడా పాల్పడుతున్నట్లు విమర్శలున్నాయి. 

1997 నుంచే కొనసాగుతోందా?

ఏజెన్సీ కోటాలో నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం 1997 నుంచే కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పత్రాలతో వీఆర్వోలు, వీఆర్‌ఏలుగా ఉద్యోగాల్లో చేరి అనంతరం పదోన్నతులు పొందిన వారు ప్రస్తుతం వివిధ శాఖల్లో కీలక స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి జరిగిన నియామకాలపై పూర్తిస్థాయి పరిశీలన జరిపితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. 

చర్యలకు ఎందుకు వెనకడుగు?

విచారణ పూర్తు రెండేళ్లు గడిచినా చర్యలు లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లాలో వందల సంఖ్యలో నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన వారు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులతో పాటు వారికి సహకరించిన అధికారుల పాత్రపైనా దర్యాప్తు చేయాలని ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు