రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి
- పన్ను ఎగవేతదారులపై కఠినంగా ఉండాలి
- నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం మోపాలి
- హైదరాబాద్‌లో ప్రాంతీయ ఆఫీసులు ఏర్పాటు చేయాలి
- జీఎస్టీ కౌన్సిల్ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జీఎస్టీ సంస్కరణలను స్వాగతి స్తున్నామని, అయితే రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలనుపరిరక్షించాలనికేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కోరారు. గురువారం ఢిల్లీలో జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి అనుసరణ ప్రక్రియను సరళీకరించడంతోపాటు, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడే వారిపై జీరో టాలరెన్స్ విధానం కొనసాగాలని స్పష్టం చేశారు. తెలంగాణ సొంత పన్ను ఆదాయంలో జీఎస్టీ వాటా సుమారు 35 శాతం ఉందని భట్టి తెలిపారు. ఈ ఆదాయంతోనే రాష్ట్రంలో పాఠశాలలు, ఆసుపత్రులు, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు నిధులు సమకూరుతున్నాయని చెప్పారు. జీఎస్టీ ఆదాయంలో తగ్గుదల కేవలం లెక్కల అంశం కాదని, ప్రజలకు సేవలు అందించే రాష్ట్ర సామర్థ్యంపై నేరుగా ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.
మోటార్ వాహనాలు, క్యాపిటల్ గూడ్స్, ఇన్‌పుట్ సర్వీసుల రీఫండ్లకు సంబంధించిన మార్పులు చేపట్టే ముందు వాటి పూర్తి ఆర్థిక ప్రభావాన్ని రాష్ట్రాలకు వివరించాలని కోరారు. మోటార్ వాహనాల విషయంలో కేంద్రం అందించిన అంచనాల ప్రకారం తెలంగాణకు ఏడాదికి సుమారు రూ.800 కోట్ల ఆదాయ ప్రభావం ఉంటుందని, రాష్ట్ర సొంత అంచనాల ప్రకారం ఈ నష్టం అంతకంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
నకిలీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం..
పన్నుచెల్లింపుదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేయడంతో పాటు జీఎస్టీ మోసాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, గుర్తింపు వివరాల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని భట్టి డిమాండ్ చేశారు. వృద్ధులు, గృహిణులు, రోజువారీ కూలీలు, ఇతర అమాయకుల ఆధార్, పాన్ వివరాలను దుర్వినియోగం చేసి మోసపూరిత జీఎస్టీ రిజిస్ట్రేషన్లు సృష్టిస్తున్న ఘటనలూ ఉన్నాయని.. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా స్క్రాప్ రంగంలో జరుగుతున్న పన్ను ఎగవేతను భట్టి ప్రస్తావించారు. అసంఘటిత, నగదు ఆధారిత వ్యవస్థ కారణంగా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడం, నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ బదిలీ చేయడం జరుగుతున్నదన్నారు.
అదే సమయంలో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న చెత్త సేకరించే కార్మికులు, చిన్న స్థాయి సేకరణదారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. వీటిపై కార్యాచరణను రూపొందించేందుకు జీఎస్టీ కౌన్సిల్ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దేశంలో చాలా కాలంగా జీఎస్టీ అధికారుల కమిటీల్లో తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని, కౌన్సిల్ పునర్వ్యవస్థీకరించే కమిటీల్లో తెలంగాణకు సభ్యత్వం కల్పించాలన్నారు. స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్‌లోనూ తెలంగాణకు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరారు.
హైదరాబాద్‌లో జీఎస్టీ ప్రాంతీయ కార్యాలయాలు..
భవిష్యత్ జీఎస్టీ పరిపాలనకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు హైదరాబాద్‌కు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో జీఎస్టీఎన్, జీఎస్టీ కౌన్సిల్ సెక్రటేరియట్‌కు హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కౌన్సిల్ సమావేశంలో కేంద్రాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. దీనివల్ల జీఎస్టీ పరిపాలన రాష్ట్రాలకు మరింత చేరువ కావడంతో పాటు, సాంకేతికత ఆధారిత పన్ను మోసాల గుర్తింపు వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు.