కంచె వేసిన హైడ్రా.. కంగుతిన్న ఆర్టీసీ!

23-11-2026 | 05:15am
  1. ఎఫ్‌టీఎల్ పేరుతో 6 ఎకరాల స్థలంపై వివాదం
  2. శంషాబాద్‌లో 20 ఏళ్ల క్రితం ఆర్టీసీ డిపోకు 6 కేటాయించిన ప్రభుత్వం 
  3. సెలవు రోజుల్లో ముందస్తు నోటీసుల్లేకుండా కంచె వేసే యత్నం
  4. రికార్డులు చూపించిన ఆర్టీసీ అధికారులు
  5. అధికారులకు పోలీసులతో బెదిరింపులు?
  6. రెండు ప్రభుత్వ శాఖల మధ్య భూవివాదం
  7. ఉన్నతాధికారుల జోక్యం కోసం డిమాండ్

రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో హైడ్రా అధికారుల(Hydra officials in Shamshabad) తీరు తీవ్ర వివాదాస్పదం గా మారింది. చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ఏర్పాటైన హైడ్రా, ఇప్పుడు ఏకంగా మరో ప్రభుత్వ సంస్థ అయిన టీజీఎస్‌ఆర్టీసీకి చెందిన భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తోందన్న ఆ రోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నా యి. ఆదివారం సెలవు రోజును ఆసరాగా చేసుకుని హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగ డం, ప్రశ్నించిన ఆర్టీసీ అధికారులను పోలీసుల సాయంతో బెదిరించారన్న వార్తలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి.

20 ఏళ్ల నాటి కేటాయింపు..

శంషాబాద్ ప్రాంత ప్రజల రవాణా అవసరాలను తీర్చేందుకు, కొత్తగా ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సుమారు 20 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం శంషాబాద్ మండలం రషీద్గూడ పరిధిలో 6 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారికంగా కేటాయించింది. అప్పటి నుండి ఈ భూమి పూర్తిగా ఆర్టీసీ ఆధీనంలోనే ఉంది. శంషాబాద్ విమానాశ్రయ పరిసర ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, డిపో విస్తరణ, బస్సుల పార్కింగ్ మరియు భవిష్యత్ ప్రజా రవాణా అవసరాల కోసం ఆర్టీసీ ఈ విలువైన స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది.

సెలవు రోజుల్లో హడావుడి.. ఎఫ్టీఎల్ పేరుతో ఫెన్సింగ్ యత్నం..

అయితే, ఇటీవల ఈ 6 ఎకరాల విలువైన భూమిపై హైడ్రా అధికారుల కన్ను పడింది. సాధారణ పనిదినాల్లో కాకుండా, సెలవు రోజును ఎంచుకుని ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండానే హైడ్రా బృందాలు భారీ యంత్రాలతో ఆ స్థలంలోకి ప్రవేశించాయి. ఈ భూమి చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ చుట్టూ ఫెన్సింగ్, కంచె వేసే పనులను హుటాహుటిన ప్రారంభించారని ఆర్టీసీ సిబ్బంది ఆరోపిస్తున్నారు.

రికార్డులు చూపించినా బెదిరింపులేనా?

సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని హైడ్రా అధికారుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వం తమకు 6 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులను హైడ్రా అధికారుల ముందుంచారు. అయినప్పటికీ హైడ్రా అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా, అక్కడున్న పోలీసుల సహాయంతో ఆర్టీసీ అధికారులనే బెది రింపులకు గురిచేశారని తీవ్ర ఆ రోపణలు వ్యక్తమవుతున్నాయి.

రికార్డుల పరిశీలనలో నిర్లక్ష్యమా? సమన్వయ లోపమా?

భూముల విషయంలో చర్యలు తీసుకునే ముందు రెవెన్యూ రికార్డులు, గత ప్రభుత్వాల కేటాయింపు ఉత్తర్వులను కనీసం పరిశీలించకుండా హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రైవేటు కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాల్సిన హైడ్రా, ప్రజలకు సేవలందించే ఆర్టీసీ లాంటి ప్రభుత్వ సంస్థ భూములపై పడటం ఏంటి?‘ అని స్థానిక నాయకులు, ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం బయటపడటమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారుల జోక్యం కోసం ఆర్టీసీ సంఘాల డిమాండ్

ప్రభుత్వ భూమిని మరో ప్రభుత్వ విభాగమే స్వాధీనం చేసుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండీ, జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. హైడ్రా ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాలని, ఆర్టీసీ భూమికి రక్షణ కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు