అన్నదాత గుండెల్లో మళ్లీ గుబులు!

23-11-2026 | 05:15am
  1. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం ఖరారు ప్రకటన?
  2. రంగారెడ్డి జిల్లాలో 7 మండలాలు, 28 గ్రామాల మీదుగా 75.05 కిలో మీటర్ల అలైన్‌మెంట్
  3. భూసేకరణ ప్రతిపాదనలు పల్లెల్లో కమ్ముకున్న ఆందోళన
  4. రైతులకు కంటిమీద  కునుకు కరువు 
  5. సోషల్ మీడియాలో  గ్రామాలు, సర్వే నెంబర్లు ఇవే అంటూ విస్తృత ప్రచారం 

రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వం(Government) ఎంతో ప్రతిష్ఠాత్మ కంగా భావిస్తున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు(Ring Road) (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం నిర్మాణానికి అడు గులు వేగంగా పడుతుండటంతో, రంగారెడ్డి జిల్లాలోని పల్లెల్లో మళ్లీ అలజడి మొదలైంది. తమ జీవనాధారమైన పచ్చని పొలాలు ఎక్కడ కనుమరుగవుతాయోనని అన్నదాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

7 మండలాలు, 28 గ్రామాల మీదుగా 100 మీటర్ల వెడల్పుతో 75.05 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి భూసేకరణ ప్రతిపాదనలు ఖరారు కావడంతో గడిచిన మూడు రోజులుగా గ్రామాల్లో ఇదే అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది.కంటిమీద కునుకు లేని రాత్రులు..మాకు నిదురోస్తలేదు సారూ..

తరతరాలుగా నమ్ముకున్న భూమి పోతే మేమె లా బతకాలి?‘ ఇదీ ప్రస్తుతం ఆయా గ్రామా ల రైతుల నోట వినిపిస్తున్న ఆవేదన. ము ఖ్యంగా అలైన్మెంట్ పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు తీవ్ర అయోమయంలో కూరుకుపోయారు. ఉన్న కాస్త భూమి కూడా రోడ్డు పాలైతే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

పైసలు పాడుగాను.. ఆదెరువు పోతే ఎలా?

అభివృద్ధి పేరిట ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు వద్దని, ఆ పైసలు ఏం చేసుకుంటామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పంటలు పండించుకుంటూ, గొడ్డు గోదాను సాదుకుంటూ బతికే మాలాంటి వాళ్లకు ఆదెరువు ఇచ్చే భూమే సర్వస్వం. ఆ భూమే పోతే రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటి? గొడ్డు గోదాను ఎక్కడ మేపుకోవాలి?‘ అంటూ ప్రభుత్వ తీరుపై రైతులు శాపనార్థాలు పెడుతున్నారు.

సామాజిక ప్రభావ అంచనాకు మినహాయింపుపై ఆగ్రహం..

మొత్తం 201 కిలోమీటర్ల పొడవున (20 మండలాలు, 90 గ్రామాలు) నిర్మించనున్న దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్ అలైన్మెంట్కు ప్రభుత్వం గతేడాది జులై 8న (జీవో నం. 299) ఆమోదం తెలిపింది. తాజాగా నవంబర్ 6, 2026న జారీ చేసిన జీవో నం. 264 ద్వారా భూసేకరణ చట్టంలోని ’సామాజిక ప్రభావ అంచనా’ (సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్) ప్రక్రియ నుంచి ప్రభుత్వంమినహాయింపునిచ్చింది.

తమ అభిప్రాయాలు, బాధలు వినకుండానే నేరుగా భూసేకరణకు సిద్ధమవుతుండటంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హెచ్జీసీఎల్ అధికారులు సర్వే నంబర్లు, విస్తీర్ణాలతో కూడిన నివేదికలను హెచ్‌ఎండీఏకు, అక్కడి నుంచి జిల్లా కలెక్టర్కు పంపడంతో భూసేకరణ ప్రక్రియ ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉంది.

భూసేకరణ ఇక్కడినుండే..

రంగారెడ్డి జిల్లాలో 53.40 కి.మీ., 21.65 కి.మీ. చొప్పున రెండు విభాగాలుగా మొత్తం 75.05 కి.మీ. మేర భూసేకరణ చేపట్టనున్నారు.మాడ్గుల మండలం లో ని అన్నెబోయినపల్లి, మాడ్గుల, బ్రాహ్మణపల్లి, ఇర్విన్, కలకొండ. ఆమనగల్ మండలం లో ని సింగంపల్లి, పోలేపల్లి, చెన్నంపల్లి, ఆమనగల్లు,తలకొండపల్లి మండలం లో ని గౌరిపల్లి, ఖానాపూర్, వెంకట్రావుపేట, మెద క్పల్లి, రాంపూర్, చంద్రధన, జూలపల్లి,కేశంపేట మండలం లో ని నిర్దవెల్లి, తొమ్మిదిరేకుల.

ఫరూఖ్నగర్ మండలం లో ని భీమారం, చించోడు. కొందుర్గు మండలం లో ని ఆగిర్యాల, తంగళ్లపల్లి, చెరుకుపల్లి, కొండుర్గు (పశ్చిమ), కొండుర్గు (తూర్పు). చౌదరిగూడ మండలం లో ని తూముపల్లి, వనంపల్లి, తుమ్మలపల్లి గ్రామాల గుండా వెళ్తుంది.

రియల్ ఎస్టేట్ వృద్ధి సరే.. మా బతుకుల మాటేంటి?

ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే పారిశ్రామిక, వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం, పునరావాసంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. తమ ప్రమేయం లేకుండానే తమ పొలాలపై గీతలు గీయడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళన బాట పట్టక తప్పదని భూ బాధితులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు