అభివృద్ధిపై మాటల మంటలు

25-11-2026 | 05:15am
  1. మాజీ మంత్రి సబిత వర్సెస్ ఎమ్మెల్యే కాలే
  2. నిధుల కేటాయింపులో వివక్షపై మాజీ మంత్రి సబిత ఆరోపణలు
  3. ఆధారాలు లేని విమర్శలంటూ తిప్పికొట్టిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
  4. తన హయాంలో జరిగిన 40 ఏళ్ల అభివృద్ధిపై బహిరంగ చర్చకు సవాల్

చేవెళ్ల, నవంబర్ 24 (విజయక్రాంతి): చేవెళ్ల నియోజకవర్గ(Chevella Constituency) అభివృద్ధి పనులు, ప్రభుత్వ నిధుల కేటాయింపు విషయంలో ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ప్రభుత్వ పథకాలు(Government Schemes), నిధుల పంపిణీలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై వివక్ష చూపుతున్నారంటూ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) చేసిన ఆరోపణలను స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య(Kale Yadaiah) తీవ్రంగా ఖండించారు. 

మాటల మంటలకు కారణం ఇదే..

ఈ నెల 23న చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని 1, 2 వార్డుల్లో స్థానిక కౌన్సిలర్ చందు తన సొంత నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సబితా ఇంద్రారెడ్డి అధికార యంత్రాంగం, ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఇందిరమ్మ కమిటీ లు ప్రతిపాదించిన వారికే, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారని ఆమె ఆరోపించారు.

బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారని, వారికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇటీవల సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ టిఆర్‌ఎస్ నేత లు ప్రత్యేక సమాచారం నిర్వహిస్తూ నియోజకవర్గంపై ఆమె దృష్టి సారించారు.

తప్పుడు సమాచారంతో ఆరోపణలు వద్దు..

మాజీ మంత్రి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కాలే యాదయ్య ఘాటుగా స్పందించారు. కొం దరు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సబితా ఇంద్రారెడ్డి వంటి సీనియర్ నాయకురాలికి తగదని ఆయన హితవు పలికారు. 

పార్టీలకతీతంగా నిధులు..

చేవెళ్ల మున్సిపాలిటీలో 11 మంది కాంగ్రెస్, నలుగురు బీఆర్‌ఎస్, ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు గెలిచారని గుర్తు చేశారు. తాను ఏ పార్టీని చూడకుండా కేవలం ప్రజల అవసరాలు, సమస్యల ఆధారంగానే నిధులు మంజూరు చేస్తున్నానని స్పష్టం చేశారు. తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని, అలాంటి తనపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. దమ్ముంటే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

40 ఏళ్లలో జరగని పనులు చేసి చూపించా..

తన హయాంలో చేవెళ్ల రూపురేఖలు మార్చానని పేర్కొన్న ఎమ్మెల్యే యాదయ్య, ప్రధాన అభివృద్ధి పనులను వివరించారు.  సరైన రోడ్డు లేని చేవెళ్ల పార్లమెంట్ కేంద్ర గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించామన్నారు. ఈసీ, మూసీ నదులపై 10 వంతెనలు నిర్మించి మండలాలను అనుసంధానం చేశామన్నారు. ఇరిగేషన్, ఆర్ అండ్ బీ కార్యాలయాలతో పాటు ఎమ్మార్వో, ఆర్డీవో ఆఫీసులకు రోడ్లు, ఆధునిక బస్ స్టేషన్ నిర్మించామన్నారు. 

ఐదు మండలాల్లో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులు, 100 పడకల ఆసుపత్రి పనులు చేపట్టామన్నారు. కొత్త లైబ్రరీ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు.బుద్వేల్-కొడంగల్ రేడియల్ రోడ్డు పూర్తయితే షాబాద్ మండలంతో పాటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గం లో అభివృద్ధి విషయంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన మాటల మంటలు ఎంతవరకు వెళ్తాయో అంటూ స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చ నియాంశంగా మారింది.

మరిన్ని వార్తలు