తెలంగాణ.. అవకాశాల ఖని
- పెట్టుబడులు పెట్టండి.. సహకరిస్తాం
- భావితరాల అవసరాలకు తగ్గట్టు భారత్ ఫ్యూచర్ సిటీ
- పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనేలా అభివృద్ధి
- పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
- హెచ్ఐసీసీలో అట్టహాసంగా మొదలైన భారత్ సమ్మిట్
- ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Telangana IT Minister Sridhar Babu) ఆహ్వానించారు. రాష్ట్రం లో పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో రెండురోజుల ‘భారత్ సమ్మిట్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ‘ఫోర్జింగ్ ఎ న్యూ వరల్డ్ (కొత్త ప్రపంచ నిర్మాణం) అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు, విధాన రూపకర్తలు, పారిశ్రామిక దిగ్గజాలు తరలివచ్చారు. సమ్మిట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు.
ప్రారంభ ప్లీనరీ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కీలక ఉపన్యాసం చేశారు. సమ్మిట్‌లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ/ఐటీఈఎస్, మినరల్స్, ఈఎస్ డీఎం మాన్యుఫ్యాక్చరింగ్, టెలికాం, మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్, అర్బన్ మొబిలిటీ, బ్యాటరీ సెల్ టెక్నాలజీ ఎనర్జీ స్టోరేజ్, ట్రేడ్ ఫెసిలిటేషన్, సప్లై చైన్, ఫార్మాస్యూటికల్ మాన్యుఫాక్చరింగ్, వేస్ట్ టు ఎనర్జీ తదితర రంగాలకు చెందిన పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
వీరిలో టర్కీ, కెనడా, సౌతాఫ్రికా, యూకే, యూఎస్ఏ ప్రతినిధులు కూడా ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న విస్తృత అవకాశాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూలమైన పారిశ్రామిక విధానాలను వారికి మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. అవకాశాల ఖని తెలంగాణ అని, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. రాష్ట్రంలో తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విస్తరించేందుకు ముందుకు రావాలన్నారు.
పెట్టుబడులను పరిశ్రమలుగా, పరిశ్రమలను ఉపాధి అవకాశాలుగా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సంజయ్ జాజు, టీజీఐఐసీ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, పరిశ్రమల శాఖ కమిష నర్ నిఖిల్ చక్రవర్తి, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈ వో అజిత్‌రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీ.. సరికొత్త నగరం
భావితరాల అవసరాలకు తగ్గట్టు సుస్థిరాభివృద్ధికి పెద్దపీట వేస్తూ భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. వేగం గా పెరుగుతున్న పట్టణీకరణతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేలా... నెట్ జీరో లక్ష్యంతో, పర్యావరణహితంగా ఈ నగరాన్ని నిర్మిస్తున్నామన్నారు. భారత్ సమ్మిట్-లో భాగంగా ‘ఫ్యూచర్ సిటీ అండ్ అర్బనైజేషన్’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు ఆయా కాలాల్లో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా నిలిచాయన్నారు.
ఇప్పుడు మారు తున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నాలుగో నగరం గా భారత్ ఫ్యూచర్ సిటీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, అంతరిక్ష సాంకేతికత, అధునాతన తయారీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని.. పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ జాబితాలో అమెజాన్, హైపర్‌వాల్ట్, కంట్రోల్ ఎస్, మారుబెనీ, సెమ్‌కార్ప్, ఎన్టీటీ తదితర సంస్థలు ఉన్నాయని తెలిపారు. దేశ పారిశ్రామిక, పట్టణాభి వృద్ధికి ఒక కొత్త నమూనాగా నిలవబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవే త్తలను మంత్రి శ్రీధర్‌బాబు ఆహ్వానించారు.
భూ కేటాయింపుల నుంచి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అనుమతుల వరకు అన్ని దశల్లోనూ ప్రభు త్వం అండగా ఉంటుందని ఆయన చెప్పారు. చర్చాగోష్ఠిలో రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ సీఈ వో విజయ్ మహాజన్, సిమ్లా మాజీ డిప్యూ టీ మేయర్, అర్బన్ ఎక్స్ పర్ట్ టికేందర్ సింగ్ పవార్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ షేక్ సలావుద్దీన్, ప్రముఖ చరిత్రాకారులు సజ్జద్ షాహిద్, మాజీ ఎంపీ దివ్యా స్పందన పాల్గొన్నారు.