డ్రైనేజీగా మారిన రహదారి!
- అమీన్ పూర్‌లో ప్రయాణికులకు నరకయాతన
- రోడ్డుపై మురుగు మోత.. అధికారుల మౌనం
- ఎనిమిది నెలలుగా పట్టించుకునేవారేరీ?
- జీహెచ్‌ఎంసీ చర్యలు శూన్యం?
అమీన్‌పూర్/పటాన్‌చెరు, నవంబర్ 27: అమీన్‌పూర్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ ఓవర్ఫ్లో సమస్య(Drainage Overflow Issues) ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గత ఎనిమిది నెలలుగా మురుగు నీరు రోడ్డుపైకి చేరి ప్రవహిస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై మురుగు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు సాగించే సమయంలో మురుగు నీరు వాహనాల చక్రాల నుంచి చిమ్ముతూ ప్రయాణికులపై పడుతుండటంతో అసహ్యకర పరిస్థితులు నెలకొంటున్నాయి. దుర్వాసనతో పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితి నెలకొని నెలలు గడుస్తున్నా సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులు సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి..
ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే వి ద్యార్థులు, ఆలయాలకు వెళ్లే భక్తులు మురికి నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోంది. రోడ్లన్నీ గుంతలమయమై, వాటిలో మురుగునీరు నిలిచిపోవడంతో ద్విచక్ర వాహనదారులు తర చూ ప్రమాదాల బారిన పడుతున్నారు. పక్క నుంచి భారీ వాహనాలు వెళ్లినప్పుడు మురికి నీరు పాదచారులపై పడుతుండటంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు.
రోగాల బారిన కాలనీవాసులు..
రోడ్లపై నిలిచిపోయిన మురుగునీటి వల్ల ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసన వ్యాపిస్తోంది. దీనికి తోడు దోమల బెడద విపరీతంగా పెరిగిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిత్యం వినియోగించే రహదారిపై మురుగు నీరు ప్రవహిస్తుండటం పారిశుద్ధ్య నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ ఓవర్ఫ్లోను అరికట్టి, రహదారిని శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.