నారు పోసేవాడున్నా నీరు పోసేవాడేడి?
నారు పోసిన వాడే నీరు పోస్తాడనేది సామెత. నేడు ఆ నానుడి చెల్లుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. నారు పోసేవాడు ఉన్నా.. నీరు పోసే వాడు లేక వరి సాగుకు సెలవు ప్రకటించాల్సిన దుస్థితి ఎదురైంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక కరువు ఛాయలు అలుముకుంటున్న వేళ తాగునీటికే కటకట ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పంటగా చెప్పుకునే వరి సాగుకు విరామం రానుంది. ఈ పంటపైనే ఆధారపడిన సుమారు 45లక్షల మంది రైతులు ఆందోళనలో మునిగిపోయారు.
- దిక్కుతోచని స్థితిలో 45 లక్షల మంది రైతాంగం
- కోటి ఎకరాల మాగాణం నిశ్శబ్ద రోదన
- అన్నదాతల ముంగిట సాగునీటి సంకటం
- ఎల్ నినో ఎఫెక్ట్‌తో వరి పంటలకు బ్రేక్..
- ప్రభుత్వ అత్యవసర హెచ్చరికతో ఆందోళన
సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : ‘రాష్ట్రంలోని రైతాంగానికి ప్రస్తుత విపత్కర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఒక నిశ్చిత సాగు సీజన్(Cultivation season) (యాసంగి/రబీ)లో వరి పంటను వాయిదా వేసుకోవాల్సిందిగా అత్యవసర విజ్ఞప్తి చేస్తున్నాం. వ్యవసాయ శాస్త్రవేత్తల(Agricultural scientists) సూచనల మేరకు ప్రభుత్వం ఈ విధంగా ప్రకటిస్తోంది.
నీటి లభ్యత లేనప్పుడు వరి సాగుకు వెళ్లకుండా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు వేయడం ద్వారా రైతులు తమ పెట్టుబడిని రక్షించుకోవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సంక్షోభాన్ని కొవిడ్ లాంటి విపత్తుగా భావించి అందరూ కలిసికట్టుగా నీటిని, విద్యుత్‌ను పొదుపు చేయాలని పిలుపునిస్తున్నాం!’ ఇవీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 15న సచివాలయంలో మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు.
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్బంధ ‘క్రాప్ హాలిడే’ ఉత్తర్వులు జారీ చేయలేదు. అయితే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు... క్రాప్ హాలిడే అన్న ప్రచారంతో తెలంగాణ పల్లె గుండెను కదిలిస్తోంది. కోటి ఎకరాల మాగాణంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలో, పచ్చని పొలాల మధ్య బతికే అన్నదాత నోట ‘క్రాప్ హాలిడే’ అనే మాట రావడం కేవలం ఒక నిర్ణయం కాదు, అది ఒక ఆక్రందన, ఒక నిశ్శబ్ద పోరాటంలో ఓటమికి సంకేతం.
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం వంటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి పంటకు దూరం కావాలని అనుకోవడం వెనుక ఎన్నో ఏళ్ల నిరాశ, నిస్పృహలు దాగున్నాయి. తెలంగాణ జనాభాలో దాదాపు 55 శాతం మంది ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉన్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా సుమారు 16- నుంచి 18 శాతం వరకు ఉంటోంది. స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పెరిగినా, క్షేత్రస్థాయిలో పెట్టుబడి భారం, మార్కెటింగ్ లోపాలు, సకాలంలో అందని ప్రభుత్వ సాయం రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.
పెట్టుబడులు..- అప్పుల ఊబి..
తెలంగాణలో ఎకరా వరి సాగుకు కనీసం రూ. 30,000 నుండి రూ. 35,000, అదే పత్తి లేదా మిర్చి అయితే రూ. 80,000 నుండి రూ. 1,20,000 వరకు పెట్టుబడి అవుతోంది. గత కొన్నేళ్లుగా విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగుమందుల ధరలు, ట్రాక్టర్ల అద్దెలు 40 శాతం పైగా పెరిగాయి. నాబార్డ్, అంతకుముందు సర్వేల నివేదికల ప్రకారం తెలంగాణలో సగటున ప్రతి వ్యవసాయ కుటుంబానికి రూ.1.5 లక్షల నుండి రూ. 2.4 లక్షల వరకు అప్పు ఉంది. ఇందులో అధిక శాతం వడ్డీ వ్యాపారుల వద్ద 24 శాతం నుండి 36 శాతం అధిక వడ్డీకి తెచ్చినవే కావడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
రైతు భరోసా, రుణమాఫీ చెల్లింపుల్లో జాప్యం..
రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా అందాల్సిన ’రైతు భరోసా’ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యం, మార్గదర్శకాల సవరణల చుట్టూ తిరుగుతున్న కాలయాపన చిన్న, సన్నకారు రైతులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. మరోవైపు రూ. 2 లక్షల రుణమాఫీ పథకం పూర్తిస్థాయిలో క్షేత్రస్థాయి అర్హులందరికీ చేరకపోవడం, రేషన్ కార్డ్ లింకేజీ, సాంకేతిక కారణాల నెపంతో వేలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో సాగు సీజన్ ప్రారంభంలో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఆదరణ లేని కనీస మద్దతు ధర..
ప్రభుత్వం వరి క్వింటాలుకు ప్రకటించే మద్దతు ధరలు కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం నెపంతో, తరుగు పేరుతో క్వింటాలుకు రూ.300 నుండి రూ.400 వరకు నష్టపోయేలా చేస్తున్నాయి. సకాలంలో కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, గోనె సంచుల కొరత, మిల్లుల యజమానుల సిండికేట్ వల్ల పత్తి, మిర్చి పండించే రైతులు దళారులకు తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోతున్నారు.
దీనికితోడు వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పంట నష్టపరిహారం సకాలంలో అందడం లేదు. తెలంగాణలో దాదాపు 20 శాతం నుండి 25 శాతం వరకు ఉన్న కౌలు రైతులకు ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వల్ల, అటు పెట్టుబడి సాయం అందక, ఇటు పంట నష్టపరిహారం రాక వారి బతుకులు మరీ అగమ్యగోచరంగా మారాయి. పంటకు సెలవిస్తే భూమికి విశ్రాంతి దొరుకుతుందేమో కానీ,
ఆ భూమిని నమ్ముకున్న రైతు కుటుంబాల కడుపుకు నిలవేది? పల్లెల్లో ఉపాధి కోల్పోయే కోట్ల మంది వ్యవసాయ కూలీల బతుకులేం కావాలి? సాగు నిలిచిపోతే గ్రామీణ ప్రాంతాల నుండి హైదరాబాద్ వంటి నగరాలకు వలసలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. అన్నదాత ఏడిస్తే రాష్ట్రానికి అన్నం దొరకదనే కఠిన సత్యాన్ని పాలకులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ తక్షణ చర్యలేమిటి?
ఈ ఆందోళనకర పరిస్థితికి ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వం కేవలం బడ్జెట్ కేటాయింపుల ప్రకటనలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలవాలి. రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని సాగు సీజన్ ప్రారంభానికి ముందే ఎకరాకు నిర్దేశించిన మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
రుణమాఫీలో ఉన్న సాంకేతిక లోపాలను తక్షణమే సరిదిద్ది, అర్హులైన ప్రతి రైతుకూ కొత్త పంట రుణాలు అందేలా బ్యాంకులను ఆదేశించాలి. కొనుగోలు కేంద్రాలను ముందే తెరిచి, తరుగు, తేమ నెపంతో రైతులను వేధించే దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కౌలు రైతులను గుర్తించి వారికి కూడా రక్షణ కల్పించేలా చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలి.
తెలంగాణ పల్లె గుండె ఆగిపోకముందే, వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించేలా గట్టి చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ పాలకులపై ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
రాష్ట్రంలో 45 లక్షల మందికి వరి సాగే ఆధారం..
తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్), యాసంగి (రబీ) రెండు సీజన్లు కలిపి ఏటా సుమారు 1.25 కోట్ల నుండి 1.30 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతోంది. వానాకాలం సీజన్లో సాధారణంగా 55 లక్షల నుండి 65 లక్షల ఎకరాల వరకు వరి నాట్లు పడతాయి. తాజా వానాకాలం సీజన్ లో కూడా వర్షపాత లోటు ఉన్నప్పటికీ రైతులు దాదాపు 55.89 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు,
ఉచిత విద్యుత్, బోరు బావుల లభ్యత కారణంగా గడిచిన కొన్నేళ్లుగా రబీలో కూడా రికార్డు స్థాయిలో 55 లక్షల నుండి 67 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతూ వస్తోంది. అయితే ప్రస్తుత సూపర్ ఎల్ నినో, నీటి కొరత పరిస్థితుల వల్ల ఈ యాసంగిలో సాగు తగ్గించాలని ప్రభుత్వం కోరుతోంది. దేశవ్యాప్తంగా సాగయ్యే మొత్తం రబీ సీజన్ వరి విస్తీర్ణంలో కేవలం తెలంగాణ వాటానే 50 శాతం కంటే ఎక్కువగా ఉండటం ఇక్కడి వరి సాగు తీవ్రతకు నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నమోదిత వ్యవసాయ భూమి కలిగిన రైతుల సంఖ్య సుమారు 58.33 లక్షలు ఉంటుంది. ఈ మొత్తం రైతుల్లో దాదాపు 70 శాతం నుండి 80 శాతం మంది అంటే సుమారు 40 లక్షల నుండి 45 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వరి పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్ వంటి జిల్లాల్లో అత్యధిక శాతం మంది చిన్న, సన్నకారు రైతులు కేవలం వరి పంటను మాత్రమే ప్రధాన జీవనాధారంగా నమ్ముకున్నారు.