రోగాలకు నిలయాలు.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు!

17-10-2026 | 05:00am
  1. నాణ్యత డొల్లతో ప్రజారోగ్యంతో చెలగాటం
  2. విచ్చలవిడిగా పెరుగుతున్న సెంటర్లు
  3. తనిఖీలు మరిచి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

పటాన్చెరు, అక్టోబర్ 16: భోజన ప్రియులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందుతోందా అంటే జవాబు దొరకడం లేదు. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం, ఇస్నాపూర్ తదితర ప్రాంతాల్లో అపరిశుభ్రమైన పదార్థాలు(Unhygienic food) తిని అనారోగ్యం పాలవుతున్నారు. ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ ప్రాంతంలో ఒక హోటల్లో ఫుడ్ పాయిజన్(Food Poisoning) కారణంగా పలువురు తీవ్ర అస్వస్థకు గురవడమే కాకుండా ఓ యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఇదేవిధంగా పారిశ్రామికవాడ ప్రాంతంలో డాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్ళలో నాసిరకం తినుబండారాలు, భోజనం తిని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఆహార పదార్థాల నాణ్యత, వంటగదుల పరిశుభ్రత, మాంసం నిల్వ, వంట నూనె వినియోగంపై తగిన పర్యవేక్షణ ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పటాన్చెరు ప్రాంతంలో ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, మిర్చి బండ్లు, పానీ పూరి ఇతర చిరుతిళ్ల దుకాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కనిపించని పరిశుభ్రత..

ప్రతిరోజూ సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు డాబాలు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు రద్దీగా కనిపిస్తున్నాయి. కార్మికులు, ఉద్యోగులు, యువతతోపాటు కుటుంబాలు కూడా ఈ కేంద్రాలపై ఆధారపడుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే ప్రదేశాలు, వంట సామగ్రి, పరిసరాల పరిశుభ్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆహారాన్ని తయారు చేసే ప్రాంతాల్లో శుభ్రత, పదార్థాల నిల్వ విధానం, వంట చేసేవారు పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలను క్రమం తప్పకుండా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఆహారం రుచిగా ఉంటే సరిపోదు అది ఆరోగ్యానికి హాని కలిగించనిదిగా ఉండాలి. నాణ్యత లేని ముడి పదార్థాలు, కలుషిత నీరు, సరిగా నిల్వ చేయని ఆహార పదార్థాలు వినియోగిస్తే ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారి విషయంలో మరింత జాగ్రత్త అవసరం. అందువల్ల ఆహార నాణ్యతపై రాజీ పడకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంది. 

ఆహార భద్రత అధికారుల తనిఖీలేవి?

పటాన్చెరు ప్రాంతంలో ఆహార విక్రయ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరువైందని భోజనప్రియులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ అధికారులు, ఆహార భద్రత శాఖ అధికారులు సమన్వయంతో ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, మిర్చి దుకాణాలు, ఇతర ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల యజమానుల నుండి మామూళ్ళకు అలవాటు పడి తనిఖీలు చేయడమే మర్చిపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వార్తలు