వడ్ల కుప్పలు.. ధరల తిప్పలు..!
- ఆరుగాలం శ్రమించిన అన్నదాతకు అమ్మకాల కష్టాలు
- క్వింటాలుకు రూ.3,800 నుంచి రూ.3,200కు పడిపోయిన ధర
- ఒక్క క్వింటాలుపై రూ.600 వ్యత్యాసంతో రైతన్నకు ఆందోళన
- రోజుకో ధర చెబుతున్న వ్యాపారులు..
- అమ్మాలా? ఆగాలా? అనే సందిగ్ధంలో రైతులు
నాగల్ గిద్ద, నవంబర్ 24 : ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతకు(Paddy Farmer) చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి. పొలంలో విత్తనం వేసిన నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రకృతితో పోరాడిన రైతన్నకు(Paddy Farmers) ఇప్పుడు మార్కెట్లో మరో పరీక్ష ఎదురవుతోంది. వరి సాగుకు(Paddy cultivation) వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, అప్పులు చేసి, ఎండనక వాననక శ్రమించిన రైతులకు ధాన్యం విక్రయించే సమయంలో ధరల హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి.
మొదట్లో క్వింటాలు ధాన్యానికి రూ.3,800 వరకు పలికిన ప్రైవేటు మార్కెట్ ధర(Private market price) ప్రస్తుతం రూ.3,200కు పడిపోయిందని రైతులు చెబుతున్నారు. క్విం టాలుకు రూ.600 తగ్గడంతో పంటను వెంటనే అమ్మాలా? మరికొన్ని రోజులు ఆగాలా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. పంటకు గిట్టుబాటు ధర లభించకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరల పతనంతో రైతుకు దెబ్బ..
వరి ధాన్యం మార్కెట్ ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులు రైతులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు రూ.3,800 వరకు ధర చెప్పిన వ్యాపారులు ఇప్పుడు రూ.3,200 మాత్రమే ఇస్తామని అంటున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన 50 క్వింటాళ్ల ధాన్యం విక్రయించే రైతుకు రూ.30 వేల ఆదాయం తగ్గుతుంది.
100 క్వింటాళ్లు విక్రయించే రైతుకు ఏకంగా రూ.60 వేల వ్యత్యాసం వస్తుంది. సాగు ఖర్చులు తగ్గకపోగా పంట అమ్మే సమయానికి ధరలు పడిపోవడం రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. నిన్నటి వరకు ఒక ధర చెప్పిన వ్యాపారులు మరుసటి రోజే మరో ధర చెప్పడంతో మార్క్పె నమ్మకం కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు.
పంట చేతికొచ్చినా.. చేతిలో డబ్బులు లేవు
వరి సాగుకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలు, వ్యవసాయ యంత్రాలు, కోతలు, రవాణా ఖర్చుల రూపంలో రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. కొందరు సొంత డబ్బులతో సాగు చేస్తే, మరికొందరు అప్పులు తీసుకుని పంటను పండిస్తున్నారు. పంట చేతికొచ్చిన వెంటనే ధాన్యాన్ని అమ్మి అప్పులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ధరలు తగ్గిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అప్పులు ఇచ్చినవారి నుంచి చెల్లింపుల ఒత్తిడి పెరుగుతుండటంతో మంచి ధర వచ్చే వరకు వేచి ఉండే పరిస్థితి కూడా లేకుండా పోతోందని రైతులు చెబుతున్నారు. ధర తక్కువగా ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళారుల చేతుల్లో ధరల నిర్ణయం?
ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, మధ్యవర్తుల ప్రభావం ఎక్కువగా ఉంటోందని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామాలకు వచ్చే కొనుగోలుదారులు ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారని పేర్కొంటున్నారు. ధాన్యం రకం, నాణ్యత, తేమ శాతం ఆధారంగా ధరల్లో మార్పులు ఉండవచ్చుగానీ, ధర తగ్గింపునకు సరైన కారణాలు వివరించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లో వాస్తవ ధర ఎంత? వ్యాపారులు ఎంతకు కొనుగోలు చేస్తున్నారు? మిల్లుల వద్ద ఎంత ధర పలుకుతోంది? అనే వివరాలు రైతులకు అందుబాటులో ఉండాలని కోరుతున్నారు. కొనుగోళ్లలో పారదర్శకత లేకపోతే మధ్యవర్తుల మాటలనే నమ్మాల్సి వస్తోందని అంటున్నారు.
ప్రభుత్వం స్పందించాలి..
ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల వారీగా రైతుల వద్ద నిల్వ ఉన్న ధాన్యం వివరాలు సేకరించి, కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించే అవకాశాలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు ప్రకటిస్తున్న ధరలను పర్యవేక్షించడంతోపాటు తేమ, నాణ్యత పేరుతో జరిగే అన్యాయమైన కోతలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు అందుబాటులో తాత్కాలిక నిల్వ సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని కోరుతున్నారు.