అంగన్వాడీ సేవలపై సమిష్టి పర్యవేక్షణ
పోషణ్ మాసంలో మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు
సిద్దిపేట రూరల్,సెప్టెంబర్ 21: అంగన్వాడీ కేంద్రాల (Anganwadi centers)ద్వారా అందుతున్న పోషణ, ఆరోగ్యం, బాలల అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలని అధికారులు సూచించారు. పోషణ్ మాసం కార్యక్రమాల్లో (Poshan Month Program)భాగంగా నారాయణరావుపేట-1 అంగన్వాడీ కేంద్రంలో సోమవారం అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీ (AMC)ని ఏర్పాటు చేశారు. కేంద్రం నిర్వహణలో సమాజ భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కమిటీ పనిచేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఓ గర్భిణీకి శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి, తల్లి, శిశువు ఆరోగ్యానికి అవసరమైన జాగ్రత్తలు, పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. సర్పంచ్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడాలని, అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. తల్లులు పిల్లల ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో ICDS గ్రేడ్-1 సూపర్వైజర్ డా. దివ్య, అంగన్వాడీ టీచర్, ANMలు, ఆశా కార్యకర్తలు, తల్లులు, AMC సభ్యులు పాల్గొన్నారు.