ఫిజియో థెరపిస్ట్‌పై బీసీసీఐ వేటు

12-09-2026 | 05:10am

ముంబై, సెప్టెంబర్ 11: భారత ఆటగాళ్ల వరుస గాయాల నేపథ్యంలో చీఫ్ ఫిజియో థెరపిస్ట్ కమలేష్ జైన్‌(Chief Physiotherapist Kamlesh Jain)పై బీసీసీఐ వేటు వేసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ల ఫిర్యాదుతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు నుంచి చివరి నిమిషంలో జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్లు తప్పుకున్నారు.

గాయాల నుంచి కోలుకోకపోవడంతో జట్టుకు దూరమయ్యారు. అయితే వారి గాయాల విషయంలో చీఫ్ ఫిజియోథెరపిస్ట్ కమలేష్ జైన్ టీమిండియా మే నేజ్‌మెంట్‌కు సరైన సమాచారం ఇవ్వలేదని గంభీర్‌తో పాటు అగార్కర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గత రెండు నెలల్లో 10 మందికిపైగా భారత ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు.

గాయాల నుంచి కోలుకోని బరిలోకి దిగిన వెంటనే మళ్లీ గాయపడ్డారు. ఆటగాళ్ల గాయాలతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్.. బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే కమలేష్ జైన్ పనితీరును సమీక్షించిన బీసీసీఐ అతన్ని విధుల నుంచి తొలగించింది. ప్రస్తుతం కమలేష్ జైన్ తన నోటీస్ పీరియడ్‌లో కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయన స్థానంలో కొత్త ఫిజియోను నియమించడానికి బీసీసీఐ కసరత్తు చేస్తోంది. కొత్త ఫిజియోథెరపిస్ట్ నియామకానికి సంబంధించిన వార్తలను బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.


మరిన్ని వార్తలు