జాతీయ వేదికపై కర్రసాము
ఖేలో ఇండియాలో తొలిసారి తెలంగాణ సంప్రదాయ యుద్ధ కళ
హకీంపేట క్రీడా పాఠశాలలో ప్రత్యేక ప్రదర్శనలు
ఐదు సంప్రదాయ క్రీడల్లో 39 ఈవెంట్లు
హైదరాబాద్, నవంబర్ 27: చేతిలో వెదురు కర్ర.. కళ్లలో ఏకాగ్రత.. కదలికల్లో మెరుపు వేగం.. కర్రను గిరగిరా తిప్పుతూ చేసే విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో పండుగలు, జాతరల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కర్రసాము ఇప్పుడు జాతీయ క్రీడా వేదికపైకి చేరుతోంది. డిసెంబరు 11 నుంచి 22 వరకు తెలంగాణలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games)లో తొలిసారిగా కర్రసాము పోటీకి చోటు దక్కింది. దేశం నలుమూలల నుంచి వచ్చే యువ క్రీడాకారులకు తెలంగాణ సం ప్రదాయ యుద్ధ కళను పరిచయం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
హకీం పేటలోని రాష్ట్ర క్రీడా పాఠశాలలో ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. కర్రసాముకు తెలంగాణ గ్రామీణ జీవితంతో విడదీయరాని అనుబంధం ఉంది. కర్రసాముకు ఖరీదైన క్రీడా పరికరాలు, భారీ మైదానాలు అవసరం లేదు. గ్రామాల్లోనే పిల్లలకు శిక్షణ ఇవ్వొచ్చు. చిన్నతనం నుంచే సాధన చేయడం వల్ల శారీరక దారుఢ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. బాలబాలికలకు వ్యాయామంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది. కర్రసాములో ప్రధానంగా రెండు రకాల ప్రదర్శనలుంటాయి. ఒకటి అలంకారం.. మరొకటి యుద్ధం. అలంకార ప్రదర్శనలో ఒక్కో క్రీడాకారుడు కర్రతో వివిధ రకాల విన్యాసాలు చేస్తారు. విన్యాసాల్లో వేగం, నేర్పు, శరీర కదలికల్లో సమన్వయం ఇందులో ప్రధానంగా కనిపిస్తాయి.
యుద్ధ ప్రదర్శనలో ఇద్దరు క్రీడాకారులు తలపడతారు. నిర్ణీత నియమాలకు లోబడి తమ నైపుణ్యాన్ని చాటుతారు. ఈసారి కర్రసామును ప్రదర్శన క్రీడగానే చేర్చారు. పతకాల కోసం పోటీలు ఉండవు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంప్రదాయ క్రీడలకు ఖేలో ఇండియాలో ప్రాధాన్యమిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కర్రసాముకూ ఆ అవకాశం దక్కింది. ఈసారి ఖేలో ఇండియాలో మల్లఖంబ్లో 9, కలరిపయట్టు, థాంగ్టా, యోగాసనలో ఎనిమిది చొప్పున, గత్కాలో ఆరు ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా ఏర్పాట్లపై ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి కర్రసాము ప్రత్యేక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించారు. నిన్నటివరకు ఊరి జాతరల్లో కను విందు చేసిన కర్రసాము.. రేపు జాతీయ క్రీడా వేదికపై అలరించనుంది.