ఐవోఏ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న పీటీ ఉష

25-11-2026 | 05:10am

ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయని దిగ్గజ అథ్లెట్

న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత ఒలింపిక్ సంఘం(Indian Olympic Association) (ఐవోఏ) అధ్యక్ష పదవి ఎన్నికల రేసు నుంచి దిగ్గజ అథ్లెట్ పి.టి. ఉష తప్పుకున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి చివరి రోజైన మంగళవారం గడువు ముగిసే సమయానికి ఆమె నామినేషన్ వేయకపోవడంతో, రెండోసారి అధ్యక్షురాలిగా పోటీ చేయడం లేదని స్పష్టమైంది. ఈ నెల ప్రారంభంలో జరిగిన ’స్పోర్ట్స్‌పర్సన్స్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ మెరిట్’  ఎన్నికల్లో పి.టి. ఉష ఓటమి పాలయ్యారు. నాలుగు మహిళా కోటా స్థానాలకు జరిగిన ఈ ఓటింగ్‌లో సైనా నెహ్వాల్ కంటే తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఐదో స్థానంలో నిలిచారు.

ఎస్ వోఎం ఎన్నికల్లో బయటి శక్తుల ఒత్తిడి వల్ల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆమె అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లేఖ రాశారు. అనంతరం ఐస్ హాకీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా ఎన్నికల జాబితాలో చోటు దక్కించుకున్నప్పటికీ, చివరి నిమిషంలో పోటీ నుంచి విరమించుకున్నారు.

2022 డిసెంబర్‌లో ఐవోఏ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఉష పదవీకాలం డిసెంబర్ 5న అధికారికంగా ముగియనుంది. పి.టి. ఉష తప్పుకోవడంతో డిసెంబర్ 5న జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ముగ్గురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. డిసెంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో గగన్ నారంగ్, వీరేంద్ర సచ్‌దేవా, రాజీవ్ మెహతా పోటీ పడుతున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ప్రస్తుత ఐవోఏ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

మరిన్ని వార్తలు