కౌంటీల్లో అదరగొడుతున్న సాయి కిషోర్
20 పరుగులకే ఐదు వికెట్లు
213 పరుగుల తేడాతో గ్లౌసెష్టర్‌షైర్ ఘన విజయం
లండన్, సెప్టెంబర్ 6: కౌంటీ క్రికెట్‌లో తమిళనాడు క్రికెటర్ సాయి కిషోర్(Sai Kishore) తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. గ్లౌసెష్టర్‌షైర్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై స్పిన్నర్ సాయి కిషోర్ అద్భుత బౌలింగ్‌తో తన జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సాయి కిషోర్ 20 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టడంతో గ్లౌసెష్టర్‌షైర్ 213 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవరాల్‌గా ఏడు వికెట్లు తీసిన సాయి కిషోర్ డెర్బీషైర్ పతనాన్ని శాసించాడు. అతడి ధాటికి 319 పరుగుల ఛేదనలో తడబడిన డెర్బీషైర్ 105 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో సాయికిషోర్ 18 ఓవర్లు వేస్తే అందు లో 12 మెయిడెన్ ఓవర్లు. దేశవాళీలో ఇటీవలీ రంజీ ట్రోఫీలో నిలకడను ప్రదర్శించిన సాయికిషోర్ కౌంటీ క్రికెట్లోనూ అదే జోరును చూపిస్తున్నాడు.
తాజాగా తన ప్రదర్శనతో సాయి కిషోర్ బీసీసీఐ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు, ఎడమచేతివాటం స్పిన్నర్‌గా ఉండటం, ఇంగ్లాండ్ పరిస్థితుల్లోనూ రాణించే సామర్థ్యం ఇవన్నీ అతడికి కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. సీనియర్ల వీడ్కోలుతో భారత టెస్టు జట్టు ప్రస్తుతం మార్పుల దశలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసేందుకు యువప్లేయర్ల కోసం టీమ్ మేనేజ్‌మెంట్ చూస్తోంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ ఆధ్వర్యంలో భారత టెస్టు జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో సాయి కిశోర్ కీలకంగా మారతాడని అంచనా వేస్తున్నారు.
