పైసలు ఇస్తేనే సంతకమా..?
పంచాయతీరాజ్ కార్యాలయంలో వసూళ్ల ఆరోపణలు..!!
కింది స్థాయిఅధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామాల్లో తీవ్ర చర్చ..!!
కార్యాలయంలో అన్నీ తానై నడిపిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అంటూ ఆరోపణలు..!!
మోతె, అక్టోబర్ 01 (విజయక్రాంతి): మోతె మండల కేంద్రంలోని పంచాయతీరాజ్ కార్యాలయం(Mothe Panchayat Office)లో అధికారిక పనులకు సంబంధించి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు మండల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సామాన్య ప్రజల నుంచి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ సిబ్బంది వరకు కార్యాలయంలో తమ పనులు పూర్తి చేసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
“పైసలు ఇస్తేనే పని.. లేకుంటే సంతకం లేదు” అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పింఛన్లకు సంబంధించిన వ్యవహారాల నుంచి గ్రామపంచాయతీల బిల్లులు(Gram Panchayat Bills), అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లు, ఇతర అధికారిక ప్రక్రియల వరకు ప్రతి పనికీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి.
సర్పంచులకు చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు
గ్రామపంచాయతీలకు సంబంధించిన బిల్లులు, పనుల ధ్రువీకరణ, ఫైళ్ల కదలిక, సంతకాల విషయంలో కొందరు సర్పంచులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారికంగా జరగాల్సిన పనులకు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు సర్పంచులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
కంప్యూటర్ ఆపరేటర్‌దే హవా..?
మండల పంచాయతీరాజ్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ కీలక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, కార్యాలయ కార్యకలాపాలను అన్నీ తానై నడిపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సమక్షంలోనే కొన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అధికార దుర్వినియోగం, వసూళ్ల వ్యవహారాలపై పలు గ్రామాల ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారని సమాచారం.
ఉన్నతాధికారులు స్పందించాలి.?
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాల్సి ఉండగా, డబ్బులు ఇస్తేనే పని జరిగే పరిస్థితి ఉందన్న ఆరోపణలు నిజమేనా? అనే అంశంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే నిరాధార ఆరోపణలకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు స్పష్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మోతె పంచాయతీరాజ్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, వసూళ్ల ఆరోపణలపై విచారణ చేపడతారా? లేదా అన్నది వేచి చూడాలి మరి.