కనుమరుగవుతున్న కాడెడ్లబండి!
- పల్లెల్లో నాడు రవాణాకు పెద్దదిక్కు.
- రైతు రథానికి ఆదరణ కరువు
- ట్రాక్టర్‌లు, ఆటోల రాకతో తప్పని గండం
- ఇక జ్ఞాపకమే అంటూ మదనపడుతున్న నాటి రైతులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),నవంబర్ 10: పల్లెల్లో ఎడ్లబండి ఆగమైపోతుంది.ఆధునిక యాంత్రీకరణ(Modern Mechanization) చక్రాల కింద నలిగిపోతుంది. రైతు రథంలా బాసిల్లిన ఎడ్లబండి కనుమరుగవుతోంది.ఇలాగే వదిలేస్తే ఎంత వెతికినా కానరాని పరిస్థితికి చేరుకునే ప్రమాదం పొం చి ఉంది.సీల జాడలేదు.ముళ్ళు కర్ర మూలన పడింది.
ఇరుసు విరిగింది. పయ్య లు ముక్కలయ్యాయి. దుత్తలు మాయమయ్యాయి.పండుగొచ్చినా... పబ్బం వచ్చినా.. ఊరికైనా.. చెరువుకైనా.. పొలానికయినా.. జాతరకైనా.. ఎటు వెళ్లాలన్న రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది ఎడ్లబండి.ప్రసవం వేళ అంబులెన్స్ లా.. శుభకార్యాలకు వాహనంలా రైతులకు తోడుగా ఉండే ఎద్దుల బండి ప్రస్తుతం ప్రభావం కోల్పోతుంది....
యాంత్రికరణ వేగంలో ఎడ్ల బండి గల్లంతయింది.ట్రాలీ ఆటోలు,ట్రాక్టర్ల స్పీడుకు ఎడ్లబండి చరిత్రపుటల్లో జ్ఞాపకంలా నిలిచిపోనుంది.రైతు రథంలా వెలిగి,ప్రభావం కోల్పోతుంది.గ్రామాల్లో రెండు,మూడు ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఇంట్లో ఎడ్లబండి ఉండేది.పంట పొలాలకు ఎరువులు తీసుకువెళ్లాలన్నా,కూలీలను పనులకు తీసుకువెళ్లాలన్నా ఎడ్లబండి పైనే వెళ్లేవారు.
ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను రైతు ఇంటికి క్షేమంగా ఎడ్లబండి పైనే తరలించేవారు. ధాన్యం, మిర్చి, పత్తి, మొక్కజొన్న ఏ పంటైన ఎడ్లబండ్ల లోనే తరలించేవారు. పంటలను ఇంటికి తీసుకు వెళ్లేం దుకు,మార్కెట్లో విక్రయించేందుకు కూడా రైతులు ఎడ్లబండి పైనే ఆధారపడేవారు.త మ పంటలే కాకుండా ఎడ్ల బండిని ఆధారం చేసుకుని రైతు వ్యాపారం చేసేవారు.
ఇతర రైతులకు ఎడ్ల బండిని పంపించి అద్దె తీసుకునేవారు.ఎడ్లబండి పై మొరం, ఇసుకతో పాటు గృహ నిర్మాణానికి అవసరమైన ప్రతి పనికి ఎడ్లబండిని ఉపయో గించేవారు.చెరువుల్లో నుంచి పూడిక మట్టి, ఇళ్ల నుంచి పెంటను తరలించి పంటచేలల్లో చల్లేవారు.
ఇటు వ్యవసాయంతో పాటు అద్దెతో మరింత ఆదాయం రైతులకు సమకూరేది.ఇలాంటి వాటితో రైతులకు ఏడాదంతా పనులు లభించేవి. ఇంత ప్రాధాన్యత కలిగిన కాడెడ్లబండి నేడు ట్రాక్టర్లు, ఆటోల రాకతో వాటికి ప్రాధాన్యత తగ్గింది. దీంతో కాడెడ్ల బండి ఇక జ్ఞాపకంగా మిగలనుందని నాటి రైతులు మదన పడుతున్నారు.
శుభకార్యాలు వస్తే ముస్తాబు:
ఎడ్లబండ్లు వ్యవసాయ సంబంధమైన పనులకే కాకుండా ప్రయాణాలకు కూడా ఎంతో ఉపయోగపడేవి.ఒకప్పుడు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే రహదారులు సక్రమంగా ఉండేవి కావు.ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ బస్సులు గ్రామాలకు నడిచేవి కావు.ఈ క్రమంలో ఎడ్లబండి రైతులకు ఆధారంగా ఉండేది.పెళ్లిళ్లకు ఇతర శుభకార్యాలకు ఎడ్లబండ్లను ముస్తాబు చేసుకుని వెళ్లేవారు.
అంతేకాకుండా బంధువులు వచ్చినా,బంధువులను పంపించినా ఎడ్లబండిని ఉపయో గించుకునేవారు.ఇలా ప్రయాణ సాధనంగా కూడా రైతులకు ఎడ్లబండి ఉపయోగపడేది. మరోవైపు ఆపదలో ఎడ్లబండి అంబులెన్స్ లా సేవలందించేది.ప్రసవ సమయంలో ఎడ్లబండి ద్వారానే ఆసుపత్రులకు తరలించేవా రు.పాము కాటుకు గురైనా,అనుకోని ప్రమా దం జరిగినా రాత్రి,పగలు తేడా లేకుండా ఎడ్లబండి పైనే వైద్యం అందించేందుకు తరలించేవారు.ఇలా ఎడ్ల బండి రైతులకు బతుకు బండి గా మారింది.
ట్రాక్టర్లు.. ట్రాలీ ఆటోల రాకతో..:
రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎడ్లబండికి యాంత్రీకరణతో నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఆధునిక సాంకేతిక చక్రాల కింద ఎడ్లబండి నలిగిపోతుంది. ట్రాలీ ఆటోలు,ఆటోలు,ట్రాక్టర్ల రాకతో క్రమక్రమంగా ఇది కనుమరుగయ్యే పరిస్థితి నెల కొంది.ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయం దుక్కులు దుండడంతో పాటు పంట పొలాల నుంచి పంటను ఇళ్ళకు,మార్కెట్ కు తరలిస్తుండడం ప్రారంభించారు.
వివిధ ప్రాంతాలకు ఆటోల ద్వారా ప్రయాణం పెరిగిపోయింది. ఫలితంగా రైతులకు అదనపు ఆదాయం తగ్గిపోయి అనవసరపు ఖర్చులు పెరిగిపోయాయి.
ఎడ్లబండిని బాడుగకు తీసుకునే రోజులవి
వ్యవసాయంలో ఎడ్లబండ్ల వాడకం తగ్గడంతో ఉపాధి తగ్గిపోయింది. 20 ఏళ్ల క్రితం ఖరీఫ్ సమయంలో క్షణం తీరిక ఉండేది కాదు. బండ్లను గ్రామాల్లో బాడుగకు తీసుకు వెళ్లేవారు. అప్పట్లో ఎడ్లబండ్లు బాడుగకు దొరకడం కూడా కష్టంగా ఉండేది. గతంలో వడ్లు నూర్పాలన్నా ఎడ్లను, ఎడ్లబండ్లను ఉపయోగించేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, వరియంత్రాన్ని ఉపయోగిస్తుండడంతో ఎడ్లు,ఎడ్లబండ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
_ పటేల్ ధర్మారెడ్డి, రైతు తిమ్మాపురం.