బంగారం షాపు - సైనైడ్ ఘాటు!
- బంగారం షాప్లలో ప్రత్యక్షమవుతున్న ప్రమాదక రసాయనం
- జీడిమెట్ల ఘటనతో ప్రజల్లో ఉలిక్కిపాటు
- భద్రతా ప్రమాణాల గురించి అనుమానాలు
- అధికారులు తనిఖీలు చేపట్టాలని వేడుకోలు
సూర్యాపేట రూరల్, అక్టోబర్ 16: మన కళ్ల ముందే జరుగుతున్న ఘోరాలు, వ్యవస్థ నిర్లక్ష్యం మనల్ని తీవ్రంగా ఆలోచింపజేయాలి. జీడిమెట్ల(Jeedimetla)లో ఇటీవల మధిర ప్రాంతంలోని ఏరుపాలెం గ్రామానికి చెందిన జానకి, గోపికృష్ణ దంపతుల రెండేళ్ల ముద్దుల కూతురు మిషాని తీసుకొని ఒక జ్యువెలరీ షాప్లో నగల కొనుగోలుకు వెళ్లిన సమయంలో ఆ పాప ఆడుకుంటూ సైనైడ్(Cyanide) పట్టుకుని తినే పదార్థం అని నోట్లో పెట్టుకుని ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ఈ విషాదం ఎక్కడో నగరంలో జరిగింది కదా అని మనం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. నేడు జిల్లా కేంద్రం నుంచి ప్రతి గల్లీ, ప్రతీ మండలం, ప్రతీ గ్రామం వరకు నగల దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మరి మన జిల్లాలో ఉన్న ఈ గోల్ షాపులు, వర్క్ షాపు పరిస్థితి ఏమిటి? ఇక్కడ జరుగుతున్న తనిఖీలు ఏపాటివి? ప్రజల ప్రాణాల భద్రత కోసం అధికారుల ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముందస్తు తనిఖీలతో అప్రమత్తం చేయాలి..
జిల్లా వ్యాప్తంగా వందలాది నగల దుకాణాలు, బంగారం తయారీ కేంద్రాలు నివాస ప్రాంతాల మధ్యే ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేకుండా యథేచ్ఛగా నడుస్తున్నాయి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. బంగారం కరిగించడానికి, శుద్ధి చేయడానికి వాడే అత్యంత ప్రాణాంతకమైన ‘సైనైడ్’ వంటి విషపూరిత రసాయనాలను ఎటువంటి భద్రతా నిబంధనలు పాటించకుండా దుకాణాల్లో బహిరంగంగా ఉంచుతున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తనిఖీల మాటేంటని చెవులు కొరుకుంటున్నారు. ఏదైనా ఒక ప్రమాదం జరిగితేనే మే ల్కొంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే షాపుల్లో కస్టమర్లు, ముఖ్యంగా చిన్న పిల్లలు వస్తుంటారనే కనీస స్పృహ లేకుండా ఇలాంటి విష పదార్థాలను అందుబాటులో ఉంచడం ఎంతవరకు స మంజసం? అని మండిపడుతున్నారు.
అనుమతుల మాటేంటి..?
జిల్లాలో ఎన్ని జ్యువెలరీ షాపులకు ప్రా ణాంతక రసాయనాలు వాడేందుకు సరైన లైసెన్సులు ఉన్నాయా.. వాటి నిల్వపై అధికారులు ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేశారా.. ప్రమాదం జరిగిన చోట కేవలం తూతూ మంత్రంగా అనుమతులు ఇచ్చి, ఆ తర్వాత వాటి పర్యవేక్షణను గాలికి వదిలేయడం వల్లనే పసికందుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు అనుకుంటున్నా రు. ముందస్తు తనిఖీలు లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే వ్యాపా రులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. .
అప్రమత్తత అవసరం...
జిల్లా ప్రజలు, తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. మనం షాపింగ్కు వెళ్లినప్పుడు మన పిల్లలను ఒక క్షణం కూడా వదిలిపెట్టకూడదు. చిన్న పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణ ఉండదు. వారు ఆడుకుంటూ ప్రమాదకర వస్తువులను నోట్లో పెట్టుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ తమ పిల్లల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎం వస్తది అన్ని ప్రమాదం జరగక ముందే అప్రమత్తం గా మన జాగ్రత్తలో మనం ఉంటె మంచిదనీ పలువురు చెబుతున్నారు.
అధికారులు దృష్టి సారించాలి..
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నగల దుకాణాలు, గోల్డ్ వర్క్షాపుపై జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. బంగారం షాపుల్లో సైనైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను నిల్వ చేసే విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలి.
ప్రతి మండల కేంద్రంలోనూ, జిల్లా కేంద్రంలోనూ నిబంధనలు పాటించని దుకాణాలపై ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ లేదా సెల్ బాడీని ఏర్పాటు చేయాలి. ప్రజలు కూడా తమ చుట్టూ జరిగే ఇటువంటి ప్రమాదకర పరిస్థితులపై అప్రమత్తంగా ఉండి, అధికారులకు సమాచారం అందించాలి. అధికారులు అక్రమ విధానాలు అనుసరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇటువంటి ఘటన ఏ ఇంట్లో జరగకూడదు
మా ఇంట్లో జరిగిన ఈ ఘటన ఏ ఇంట్లో కూడా జరగకూడదు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఈ బంగారం షాపుల్లోకి సైనైడ్ ఏ విధంగా దొరుకుతుందో ఆరా తీయాలి. అక్రమ విధానాల్లో తీసుకొస్తే చర్యలు తీసుకోవాలి
ఏవీ రావు, సూర్యాపేట