శ్రీనివాస నగర్‌లో వైభవంగా గణేష్ ఉత్సవాలు
కుంకుమ పూజలు, అన్నదానం, దాతలకు సన్మానం
కోదాడ సెప్టెంబర్ 20, (విజయక్రాంతి): కోదాడ పట్టణంలోని 30వ వార్డ్ శ్రీనివాస నగర్‌లో ‘మదర్ తెరిసా సేవా యూత్’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 25వ వార్షిక గణేష్ నవరాత్రి మహోత్సవాలు(Ganesh Navaratri Celebrations) భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడవ రోజు గణేష్ మండపం వద్ద మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. గణపతికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం యూత్ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 30వ వార్డు కౌన్సిలర్ కారంగుల ఉమా అంజన్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై అన్నదానాన్ని ప్రారంభించారు. మదర్ తెరిసా సేవా యూత్ గణేష్ ఉత్సవాలు విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఉత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలను, యూత్ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, కాలనీ మహిళలు, యూత్ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.