విద్యార్థులు కూడి.. వాచ్‌మన్‌పై దాడి!
- గడ్డిపల్లి సాంఘిక సంక్షేమ హాస్టల్లో కలకలం
- విద్యార్థులు, వార్డెన్ మధ్య ఆరోపణ.. ప్రత్యారోపణలు
- పది మంది విద్యార్థులు హాస్టల్ నుంచి ఇంటికి!
- పదో తరగతి పరీక్షల వేళ తల్లిదండ్రుల ఆందోళన
గరిడేపల్లి, నవంబర్ 27: మండలంలోని గడ్డిపల్లి బాలుర సాంఘిక సంక్షేమ వసతి గృహం(Social Welfare Hostel)లో వాచ్ మెన్ పై విద్యార్థులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. విద్యుత్ లైట్లు ఆర్పివేసి వాచ్ మెన్ పై దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో హాస్టల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో హాస్టల్లో వసతులు, భోజన నాణ్యతపై విద్యార్థులు చేసిన ఫిర్యాదులు, తాజాగా విద్యార్థుల ప్రవర్తనపై వార్డెన్ చేసిన ఆరోపణలు ఈ వ్యవహారాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చాయి.
వార్డెన్ పై విద్యార్థుల ఆరోపణలు
కొద్ది రోజుల క్రితం హాస్టల్ వార్డెన్ సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని, మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో జిల్లా, మండల స్థాయి అధికారులు హాస్టల్‌ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ఇదే సమయంలో విద్యార్థుల ప్రవర్తనపై వార్డెన్ సైతం అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
విద్యార్థులకు చెడు అలవాట్లంటూ..!
పదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు గుట్కా, అంబర్ వంటి పదార్థాలను వినియోగిస్తున్నారని, సైకిల్ టైర్లకు పంచర్లు వేయడానికి ఉపయోగించే సొల్యూషన్‌ను ప్లాస్టిక్ కవర్లలో వేసుకొని పీలుస్తున్నారని వార్డెన్ ఆరోపించినట్లు తెలిసింది. ఈ విషయంపై వైద్యులను పిలిపించి విద్యార్థులకు పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించగా, కొంతమంది విద్యార్థులు వాటి వినియోగం గురించి అంగీకరించినట్లు సమాచారం.
దాడిని ఖండించిన వార్డెన్..
వాచ్ మెన్‌పై విద్యార్థులు దాడి చేయడాన్ని వార్డెన్ వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. హాస్టల్లో క్రమశిక్షణ పాటించని విద్యార్థులు తమకు వద్దని, వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. గతంలోనూ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి వారి అలవాట్ల గురించి వివరించామని పేర్కొన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాచ్ మెన్‌పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది విద్యార్థులను హాస్టల్ నుంచి పంపించినట్లు వెల్లడించారు. డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్న వాచ్ మెన్ శోభన్‌బాబును సైతం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సూర్యాపేట హాస్టల్‌కు పంపించినట్లు తెలిపారు.
పదో తరగతి పరీక్షల వేళ.. తల్లిదండ్రుల ఆందోళన
మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు వార్డెన్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్ది మంచి మార్గంలో నడిపించాల్సిన వార్డెన్, కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమ పిల్లలపై ఆరోపణలు చేసి హాస్టల్ నుంచి పంపించడం సరికాదని వాపోయారు. కొద్ది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ఉండగా, దూర ప్రాంతాలకు చెందిన తమ పిల్లలు ఎక్కడ ఉండి పరీక్షలకు ఎలా హాజరవుతారని ప్రశ్నిస్తున్నారు. రెండు రోజులుగా హాస్టల్ చుట్టూ తిరుగుతున్నా వార్డెన్ తమతో మాట్లాడటం లేదని అసహనం వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన వసతి గృహాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు విద్యార్థులపై క్రమశిక్షణారాహిత్యం, మత్తు పదార్థాల వినియోగం వంటి ఆరోపణలు, మరోవైపు వార్డెన్, వాచ్మెన్లపై విద్యార్థుల ఫిర్యాదులు, తల్లిదండ్రుల అభ్యంతరాలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిగ్గుతేల్చాలని, విద్యార్థులకు మానసిక కౌన్సెలింగ్ అందించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా, వారి భవిష్యత్తు దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.