ఆర్ అండ్ బి శాఖలో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు
సూర్యాపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) శాఖలో కారుణ్య నియామకం పేరిట బాధితుల నుంచి భారీగా నగదు డిమాండ్ చేసి, డబ్బులు ముట్టజెప్పిన వేరొకరికి అడ్డదారిలో పోస్టింగ్ కట్టబెట్టిన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) ఉత్తర్వులు జారీ చేశారు. అతడిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు, పూర్తి వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఆర్ అండ్ బి శాఖలో వాచ్ మెన్ గా పని చేస్తూ 2023లో గుండె పోటుతో మృతిచెందిన మండపల్లి భరత్ బాబు కొడుకు కారుణ్య నియామకం కింద పోస్టింగ్ ఇవ్వడానికి జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్ కుమార్ డబ్బులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. అంత పెద్ద మొత్తం చెల్లించుకోలేక బాధితుడు ఆఫీసు చుట్టు ముడేళ్ళుగా తిరుగుతున్న ఆ పోస్టింగ్‌ను తొక్కిపెట్టారు. అదే సమయంలో ఆ పోస్టింగ్ కోసం డిమాండ్ చేసిన మొత్తాన్ని సమర్పించిన వేరొక అభ్యర్థికి పోస్టింగ్ కట్టబెట్టినట్లు వివరించారు.
దీనిపై బాధితుడు జిల్లా కలెక్టర్ ను ఆశ్రయించడంతో సిబ్బంది నిర్వాకం వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రాథమిక సమాచారాన్ని పరిశీలించిన కలెక్టర్.. జూనియర్ అసిస్టెంట్ శ్రీరామ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కేవలం జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతైన ప్రత్యేక విచారణకు . అదనపు కలెక్టర్, ఆర్ అండ్ బి సూపరింటెండింగ్ ఇంజినీర్ (ఎస్‌ఈ), ఆడిట్ ఆఫీసర్‌లతో కూడిన విచారణ కమిటీని నియమించినట్లు తెలిపారు. నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని వారిని ఆదేశించారు.