ప్రసవం వేళ ఊపిరి కష్టమైనా తల్లీబిడ్డను కాపాడిన వైద్యులు
ఊపిరితిత్తుల వ్యాధి, పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న 37 ఏళ్ల గర్భిణికి సురక్షిత ప్రసవం
కోదాడ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు, పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న 37 ఏళ్ల గర్భిణికి మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Yashoda Hospital) వైద్యులు విజయవంతంగా ప్రసవం నిర్వహించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జోష్ణ మాట్లాడారు.
చిన్ననాటి నుంచి పోలియోతో పాటు కైఫోస్కోలియోసిస్, రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్, టైప్-2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న ఆమె 34 వారాల 4 రోజుల గర్భంతో తీవ్రమైన శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఐసీయూలో ఉంచి BiPAP శ్వాస సహాయం అందిస్తూ నిరంతరం పర్యవేక్షించారు. పల్మనాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా, నియోనాటాలజీ నిపుణుల సమన్వయంతో చికిత్స అందించి రీజినల్ అనస్థీషియాతో సిజేరియన్ నిర్వహించారు.
2.2 కిలోల బరువున్న మగ శిశువు సురక్షితంగా జన్మించాడు. ప్రసవం అనంతరం తల్లికి ఐసీయూలో కొనసాగించి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత డిశ్చార్జి చేశారు. క్లిష్టమైన హైరిస్క్ గర్భధారణను బహుళ విభాగాల వైద్యుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు రామకృష్ణ, యుగంధర్ బట్టు మేనేజింగ్ డైరెక్టర్ వాసు కిరణ్ రెడ్డి, వెంకటరత్నాకర్ తదితరులు పాల్గొన్నారు