ప్రజలకు భద్రత.. పోలీసుల బాధ్యత
ఎస్సై క్రాంతి కుమార్..
మహిళలకు మరింత చేరువగా పోలీసు.. ‘అక్క కార్యక్రమం’తో ప్రజల్లో భరోసా..
తుంగతుర్తి, (విజయక్రాంతి): ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, ప్రతి ఒక్కరికీ పోలీసు శాఖ అండగా నిలుస్తుందనే భరోసా కల్పించడమే లక్ష్యంగా పోలీసులు ముందుకు సాగుతుందని తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్(SI Kranthi Kumar) అన్నారు.
బుధవారం పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి జిల్లా ఎస్పీ నర్సింహ ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ రావు సూచనలతో ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మహిళలు, ఆటో డ్రైవర్లు, చిన్నారుల రక్షణ, ఫోక్సు చట్టాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, గంజాయి వ్యతిరేకతపై అవగాహన కల్పించారు.
ప్రజలు పోలీస్ స్టేషన్కు రావడానికి భయపడాల్సిన అవసరం లేదని, సమస్య ఏదైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్లు ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా పోలీసుల దృష్టికి తీసుకువచ్చేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడమే పోలీస్ అక్క కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
పోలీసులు కేవలం నేరం జరిగిన తర్వాత స్పందించే వ్యవస్థగా కాకుండా.. ప్రజల సమస్యలను ముందుగానే తెలుసుకుని పరిష్కరించే ప్రజా భరోసా వ్యవస్థగా పనిచేయాలనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.