హ్యాట్సాఫ్ కలెక్టర్ అమ్మా..
* సద్దుల బతుకమ్మలో చిన్నారుల భద్రతకు ప్రత్యేక రిస్ట్ బ్యాండ్లు
* ఉర్సుగుట్ట వద్ద చిన్నారులకు రిస్ట్ బ్యాండ్లు అందజేసిన ఖిలా వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్
వరంగల్, అక్టోబర్ 18(విజయ క్రాంతి): సద్దుల బతుకమ్మ పండుగ(Saddula Bathukamma Festival) సందర్భంగా చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టిన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు(Warangal District Collector Dr. Satya Sarada) మహిళలు అభినందనలు తెలియజేస్తున్నారు. పండుగ వేడుకల్లో పిల్లలు తప్పిపోకుండా వారి చేతికి తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు(Mobile numbers) ఉన్న రిస్ట్ బ్యాండ్లను వేయించే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ “కలెక్టర్ మేడమ్కు సెల్యూట్”అంటూ ప్రశంసిస్తున్నారు.
వరంగల్ నగరంలోని పలు ప్రధాన కేంద్రాల్లో సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పర్యాటక శాఖ(Tourism Department) ఆధ్వర్యంలో రెవెన్యూ, మున్సిపల్ శాఖల(Municipal departments) అధికారుల సమన్వయంతో చిన్నారులకు తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు ముద్రించిన రిస్ట్ బ్యాండ్లను అందజేస్తున్నారు.
ఉర్సుగుట్ట వద్ద రిస్ట్ బ్యాండ్ల పంపిణీ
ఖిలా వరంగల్ మండలం ఉర్సుగుట్ట వద్ద ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఖిలా వరంగల్ మండల తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ చిన్నారులకు తల్లిదండ్రుల మొబైల్ నంబర్లు ఉన్న రిస్ట్ బ్యాండ్లను అందజేశారు. పండుగ రద్దీలో పిల్లలు తప్పిపోయిన సందర్భంలో వారిని గుర్తించి, తల్లిదండ్రులకు సమాచారం అందించేందుకు ఈ రిస్ట్ బ్యాండ్లు ఉపయోగపడనున్నాయి. ముందస్తు జాగ్రత్తగా చేపట్టిన ఈ చర్య తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తోంది.
సద్దుల బతుకమ్మ వేడుకల్లో చిన్నారులు తప్పిపోయినప్పుడు వారి చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్పై నమోదైన తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించే అవకాశం ఉంటుంది. దీంతో చిన్నారులను వారి కుటుంబ సభ్యుల వద్దకు సురక్షితంగా చేర్చేందుకు వీలవుతుంది. భారీ జనసందోహం ఉండే పండుగ వేడుకల్లో ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని మహిళలు అభిప్రాయపడుతున్నారు.
సద్దుల బతుకమ్మ వంటి భారీ వేడుకల్లో చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనీయమని మహిళలు పేర్కొంటున్నారు. పిల్లల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు, ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న అధికారులకు అభినందనలు తెలుపుతున్నారు.