రొమ్ము క్యాన్సర్‌కు అధునాతన చికిత్స

26-10-2026 | 05:20am

కిమ్స్ వైద్యుల వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రొమ్ము క్యాన్సర్(Breast Cancer ) బాధితులకు వ్యాధి నిర్ధారణ నుంచి చికిత్స, కోలుకున్న తర్వాత ఆరోగ్య సంరక్షణ వరకు సమగ్ర సేవలు అందించేందుకు హైదరాబాద్ కొండాపూర్‌లోని కిమ్స్ రెనోవా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్(KIMS Renova Cancer Institute) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది.

రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా బి -రెడీ, బి -అహెడ్, బి -యు అనే మూడు విభాగాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. బి -రెడీ విభాగంలో త్రీడీ మ్యామోగ్రఫీ, స్టీరియోటాక్టిక్ బయాప్సీ, కణజాల పరీక్షలు, జన్యు పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణకు ప్రాధాన్యమిస్తున్నారు. బి-అహెడ్ విభాగంలో శస్త్రచికిత్స, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ నిపుణులు సమన్వయంతో చికిత్స అందిస్తారు.

అవసరాన్ని బట్టి రొమ్మును సంరక్షించే శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. బి-యు విభాగంలో చికిత్స అనంతరం కోలుకునేందుకు ఫిజియోథెరపీ, లింఫెడిమా నిర్వహణ, పోషకాహార సలహాలు, మానసిక ఆరోగ్య సహాయం, నొప్పి నియంత్రణ, యోగా సేవలను ‘పింక్ రూమ్’ ద్వారా అందిస్తున్నారు.

‘బి-వెల్ వెడ్నెస్’ కార్యక్రమం కింద ఫాలో-అప్ రోగులకు రాయితీ ప్యాకేజీతో సేవలు అందించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ రావు బొల్లినేని మాట్లాడుతూ, రొమ్ములో గడ్డలు లేదా అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కిమ్స్ రెనోవా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆంకాలజీ సేవల డైరెక్టర్ డాక్టర్ సతీష్ పవార్ మాట్లాడుతూ, చికిత్స అనంతరం శారీరక, మానసిక పునరావాసం కూడా కీలకమని తెలిపారు. 

మరిన్ని వార్తలు