తరాలు మారినా.. విద్యార్థి ఉద్యమాలకు జంపాలే స్ఫూర్తి!

05-11-2026 | 04:37pm
  1. జెన్‌ ఎక్స్‌ నుంచి జెన్‌ జీ వరకు పోరాటాలకు ఉత్ప్రేరకం జంపాల చంద్రశేఖర ప్రసాద్..
  2. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఆర్‌. ఉదయ్‌.

ఆలేరు, నవంబర్ 5 (విజయక్రాంతి): తరాలు మారినా, కాలాలు మారినా ప్రజాస్వామిక విద్యార్థి(Democratic Student) ఉద్యమాలకు జంపాల చంద్రశేఖర ప్రసాద్ స్ఫూర్తిగా నిలిచారని పీడీఎస్‌యూ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆర్‌. ఉదయ్‌(District Secretary R. Uday) అన్నారు. జంపాల 51వ వర్ధంతి సందర్భంగా ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలపై స్పందిస్తూ విద్యార్థుల హక్కులు, విద్యారంగంలో ప్రజాస్వామిక విలువల సాధన కోసం జంపాల నిరంతరం పోరాడారని గుర్తుచేశారు. సమాజంలోని దోపిడీ, అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా విద్యార్థులను, ప్రజలను సంఘటితం చేసి పోరాటాలకు నడిపించారని పేర్కొన్నారు.

1975 నవంబర్ 5న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రభుత్వ హయాంలో పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్యతో పాటు జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ను హత్య చేశారని ఆరోపించారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో విజయవాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇల్లందు సమీపంలోని చీకటి గండ్ల అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చిచంపారని తెలిపారు.

జంపాల భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు, ఆలోచనలను అంతం చేయలేరని, నేటి పేపర్ లీకేజీలు, ఓటు చోరీలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి పోరాటాల్లో ఆయన స్ఫూర్తి కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో సుమారు రూ.12 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వాలు మారుతున్నా వాటి విడుదలలో మాత్రం జాప్యం జరుగుతోందని విమర్శించారు.

ప్రభుత్వం వెంటనే పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని, లేనిపక్షంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బేజాడి కుమార్, అరుణోదయ నాయకులు మేకల వెంకటేష్, నవ్య, హరీష్, సిద్ధార్థ, బాబు, ఉదయశ్రీ, అఖిల, సుకన్య, అజయ్, రాంచరణ్, స్నేహ, భవాని, రాజేష్, జస్వంత్, యశశ్విని, హారిక, సౌమ్య, సాత్విక, ఋషిక, చరిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు