బస్వాపూర్ హై లెవల్ కెనాల్ నుంచి వడపర్తి ఆగ చెరువుకు కాలువ పనులు ప్రారంభం..
- రెండు నెలల్లో 7.5 కిలోమీటర్ల కాలువ పనులు పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి..
- రైతులకు సాగునీరు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.
ఆలేరు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): భువనగిరి నియోజకవర్గంలో(Bhongir Constituency) సాగునీటి సదుపాయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) కృషి చేస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) అన్నారు. బస్వాపూర్ హై లెవల్ కెనాల్ నుంచి వడపర్తి ఆగ చెరువుకు నీటిని అందించే కాలువ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు.
రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి
ఈ కాలువ నిర్మాణం పూర్తయితే వడపర్తి ఆగ చెరువుకు నీరు చేరడంతో భువనగిరి, బీబీనగర్ ప్రాంతాల రైతులకు సాగునీటి సదుపాయం మెరుగుపడనుంది. దీంతో అనేక ఎకరాల వ్యవసాయ భూములకు నీరు అందడంతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 7.5 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్న కాలువ నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. రైతులకు సాగునీరు అందించే ఈ పనుల ప్రారంభం చూస్తుంటే దసరా పండుగ నాలుగు రోజుల ముందే వచ్చినంత ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తోటకూర మానస–సురేష్, ఆత్మ కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ పక్కిర్ కొండల్ రెడ్డి, చందుపట్ల పీఏసీఎస్ చైర్మన్ జీలుగు సతీష్ పవన్,
బీబీనగర్ పీఏసీఎస్ చైర్మన్ పొట్టోళ్ల శ్యామ్ గౌడ్, భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లంల జంగయ్య యాదవ్, బీబీనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.