బుద్ధనగర్‌లో నిరుపయోగంగా ‘స్ట్రీట్ వెండర్స్'

16-10-2026 | 06:54pm
  • పట్టించుకోని అధికారులు.. ప్రజాధనం వృథా!

మేడిపల్లి, అక్టోబర్ 16 (విజయక్రాంతి);​ వీధి వ్యాపారులకు(Street vendors) క్రమబద్ధమైన ఉపాధి మార్గం చూపిస్తూ, ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్యలను(Traffic problems) నివారించాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన ‘స్ట్రీట్ వెండింగ్ జోన్(Street Vending Zone) బుద్ధనగర్‌లో నిరుపయోగంగా మారింది. మున్సిపల్ అధికారులు(Municipal officials) లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ వసతులు ప్రస్తుతం వీధి వ్యాపారులకుగానీ, స్థానిక ప్రజలకుగానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పడివున్నాయి. ప్రజాధనాన్ని వెచ్చించి కల్పించిన ఈ మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో వినియోగంలోకి రాకపోవడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

​లక్ష్యం నెరవేరుతోందా?

​ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వీధి వ్యాపారులకు ఒకే చోట స్థిరమైన వ్యాపార స్థలాన్ని కల్పించడం ఈ వెండింగ్ జోన్ల ముఖ్య ఉద్దేశం. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధికారులు సరిగ్గా పర్యవేక్షించకపోవడమే ఈ దుస్థితికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్కడ వ్యాపారాలు నిర్వహించేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు లేకపోవడం, విద్యుత్, తాగునీరు, రక్షణ వసతులు కల్పించకపోవడంతో వ్యాపారులు అక్కడకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

​అధికారులు స్పందించాలి

​సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి స్ట్రీట్ వెండింగ్ జోన్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, తగిన మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. అర్హులైన వీధి వ్యాపారులకు కేటాయింపులు పూర్తి చేసి, ఈ జోన్‌ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

​ప్రజాధనం వృథా కాకుండా చూడాలి

"ప్రజాధనంతో నిర్మించిన వసతులు ఇలా నిరుపయోగంగా మారడం విచారకరం. అధికారులు స్పందించి వీధి వ్యాపారులందరినీ ఈ జోన్‌లోకి మార్చి, రోడ్లపై ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ​ప్రజాధనం వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ వసతులు నిరుపయోగంగా మిగలకుండా అధికారులు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకుంటారా? లేక సమస్యను ఇలాగే వదిలేస్తారా? అనేది వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు