సార్ పై కాంగ్రెస్‌ భగ్గుమంది..

06-10-2026 | 04:32pm
  1. సీఇసీ జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌...
  2. భువనగిరి కలెక్టరేట్‌ ఎదుట బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా..
  3. సార్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌...

ఆలేరు, అక్టోబర్‌ 6 (విజయక్రాంతి): ప్రత్యేక ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సార్)(Special Intensive Revision) ప్రక్రియను నిలిపివేయాలని, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఇసీ) జ్ఞానేష్‌ కుమార్‌(Election Commissioner (CEC) Gyanesh Kumar) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

డీసీసీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సార్ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేశారు.

అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి సార్ ప్రక్రియలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగించకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సార్ ను నిలిపివేసే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

ధర్నా సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సార్ ప్రక్రియపై తమ అభ్యంతరాలు, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌ బండ్రు శోభారాణి, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, పీఏసీఎస్‌ చైర్మన్లు, ఆత్మ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్షాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు