ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం

07-11-2026 | 08:51pm

ఆదిలాబాద్,(విజయక్రాంతి): భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అసోసియేషన్(Bharat Scouts and Guides District Association) ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో శనివారం 77వ స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట స్కౌట్ అండ్ గైడ్స్ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యమ వ్యవస్థాపకులు బెడెన్ పావెల్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఫౌండేషన్ డే స్టికర్లను ఆవిష్కరించారు. అనంతరం సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ గౌడ్  మాట్లాడుతూ.. విద్యార్థుల్లో  దేశ భక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు అలవడేందుకు స్కౌట్ అండ్ గైడ్స్ దోహదం చేస్తుందన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో స్కౌట్ అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది జిల్లాలో 64 పాఠశాలల్లో కొత్త యూనిట్ల ఏర్పాటుకు నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. 

 జిల్లా కార్యదర్శి ఎన్. స్వామి మాట్లాడుతూ.. బాలబట ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా చీఫ్ కమీషనర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు  అన్ని పాఠశాలల్లో యూనిట్ల నమోదుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆదినాథ్, దేవేందర్ పాటస్కర్, జిల్లా కోశాధికారి కన్నం మోహన్ బాబు, జిల్లా స్కౌట్ కమీషనర్ శాస్త్రి, డీటీసి నాగిరెడ్డి, గైడ్ కెప్టెన్ అస్మా షాహీన్, స్కౌట్, గైడ్ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు