భగవద్గీత పుస్తకాల పంపిణీ
జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండలం కవ్వాల్ కొత్తపేటలోనీ శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఆలయ పూజారి కాలువ రవి స్వామి చేతుల మీదుగా సుమారు 200 భగవద్గీత పుస్తకాలను భక్తులకు అందజేశారు.
ఈ సందర్భంగా రవి స్వామి మాట్లాడుతూ.. భగవద్గీత కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని, అది మనిషికి జీవితాన్ని ఎలా నడిపించుకోవాలో బోధించే గొప్ప జీవన విధానమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి అందులోని సారాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. భగవద్గీత పఠనం ద్వారా భక్తిభావం పెంపొందడంతో పాటు, మంచి ఆలోచనలు, నైతిక విలువలు అలవడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.