తెలంగాణపైనే విమర్శలా?

07-11-2026 | 05:20pm

కొడంగల్‌ను ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: శ్రీధర్ బాబు

ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది

కరువుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది

హైదరాబాద్: కొడంగల్(Kodangal) ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మార్చడంతో పాటు స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా అగ్రి ఎక్స్‌పో స్టాళ్లను సందర్శించి, రైతుమేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగించారు.

ఎల్‌నినో ప్రభావం(El Nino impact) కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలోనూ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కరువు ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. ఈ అంశాన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్(BRS) వక్రీకరిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని విమర్శించారు.

కొడంగల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. స్థానిక యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పనతో కొడంగల్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి వివరించారు.

మరిన్ని వార్తలు