అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన డీడబ్ల్యూవో

07-11-2026 | 08:28pm

నూతన భవన నిర్మాణ పనుల క్షేత్రస్థాయి పరిశీలన

అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచన

హాజీపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ర్యాలీ గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడలో శనివారం జిల్లా మహిళా, శిశు, వికలాంగులు,  వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి (డీడబ్ల్యూవో) రౌఫ్ ఖాన్ పర్యటించారు. సీడీపీఓ విష్ణుప్రియ, సూపర్‌వైజర్ లావణ్యతో కలిసి కొలాంగూడలోని మల్టీపర్పస్ పీఎం జన్‌మన్ భవనంలో నిర్వహిస్తున్న పీఎం జన్‌మన్ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నూతన భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం ర్యాలీ అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన వాల్ పెయింటింగ్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీడబ్ల్యూవో రౌఫ్ ఖాన్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న సేవలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఎప్పటికప్పుడు అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు