జాతీయ స్థాయిలో ఘట్ కేసర్ విద్యార్థుల ఘనత

07-11-2026 | 08:24pm

గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించిన నలుగురు చిన్నారులు

విద్యార్థులను అభినందించి సత్కరించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): జాతీయ స్థాయి వేదికపై ఘట్ కేసర్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఘట్ కేసర్ గాంధీనగర్‌లోని జీఎన్ఆర్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బింగి శర్వాణి, గ్యార నాగరాజు, బాడిని దీక్షిత్, కుతాడి ఆదిత్యలు తైక్వాండో క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.

2026 ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డు కార్యక్రమంలో పాల్గొని రికార్డు సృష్టించారు.  ఈసందర్భంగా రికార్డు సాధించిన విద్యార్థులు మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకొని తమ విజయాన్ని తెలియజేశారు. విద్యార్థుల విజయాన్ని తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి వారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలతో సత్కరించి ఘనంగా గౌరవించారు.

ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి  మాట్లాడుతూ... చిన్న వయస్సులోనే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడం ఎంతో గర్వకారణమని అన్నారు. క్రీడల పట్ల ఆసక్తి, క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తమ తల్లిదండ్రులకు, గురువులకు, గ్రామానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రులు, తైక్వాండో శిక్షకులు, అకాడమీ నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాములు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు